భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇటీవల ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. భారత క్రికెటర్ల గురించి అతడు మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి.
ఆమోదించిన జై షా?
దీంతో చేతన్ శర్మపై వేటు తప్పదని భావించగా.. శుక్రవారం అతడు రాజీనామా చేయడం గమనార్హం. చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జై షాకు పంపించగా.. ఆయన ఆమోదం తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో రోహిత్ సేన సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన నేపథ్యంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే.
అప్పుడు రద్దు చేసి మళ్లీ అతడినే..
ఈ నేపథ్యంలో ఖాళీలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ.. ఈ ఏడాది జనవరి 7న చేతన్ శర్మను మరోసారి చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్‌లకు చోటు ఇచ్చింది. అయితే, ఇటీవల ఓ టీవీ చానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాలను కుదిపేశాయి.
దుమారం రేపిన వ్యాఖ్యలు
టీమిండియా క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించనప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారంటూ అతడు వ్యాఖ్యానించాడు. అదే విధంగా సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లికి వ్యతిరేకంగా జరిగిన రాజకీయాలు, కోహ్లి- రోహిత్ శర్మ మధ్య విభేదాలు తదితర విషయాలను చేతన్ శర్మ ప్రస్తావించడం వివాదాస్పదమైంది.
కావాలనే చేశారా?
ఈ నేపథ్యంలో చేతన్ శర్మ అంటే పడని బీసీసీఐ పెద్దలే ఈ స్టింగ్ ఆపరేషన్‌కు ప్రణాళిక రచించారని, అతడిని తప్పించేందుకు ఇలా ప్లాన్ చేశారని క్రీడా వర్గాల్లో చర్చ జరిగింది. తనకు తానుగా స్వయంగా తప్పుకొనేలా వ్యూహాలు రచించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో అతడు తన రాజీనామా లేఖను జై షాకు సమర్పించాడని వార్తలు రావడం గమనార్హం. ఓవైపు టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టు జరుగుతున్న వేళ చేతన్ శర్మ రాజీనామా అంశం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.