ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి అయిదుగురు డిప్యూటీ సీఎంలతో కలిపి 25 మందితో తొలి కేబినెట్ రూపకల్పన చేసారు. పక్కా సామాజిక సమీకరణాలను అమలు చేసారు. వారిని రెండున్నారేళ్లకు మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. అదే విధంగా 11 మంది పాతవారిని కొనసాగిస్తూ మరో 14 మందికి కొత్తగా ఛాన్స్ ఇస్తూ కేబినెట్ ప్రక్షాళన చేసారు. అయితే, ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. పాలనా – పార్టీ పరంగా మంత్రులు -ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం జగన్ సర్వే నివేదికలతో సిద్దమయ్యారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్ ఊహించని విధంగా అయిదుగురు మంత్రుల పైన వేటుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. తప్పిస్తున్న మంత్రుల ద్వారా ఎక్కడా సామాజిక సమీకరణం దెబ్బ తినకుండా కొత్త వారి ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా కొత్తగా ఎమ్మెల్సీలు ఖరారు విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు..
ఇప్పుడు అనూహ్యంగా మంత్రుల పని తీరు ఆధారంగా వారి పైన వేటు వేసేందుకు జగన్ సిద్దమయ్యారు. దీంతో..ఇప్పటి వరకు పని తీరు మెరుగు పర్చుకోవాలంటూ హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు శాసనమండలిలో వైసీపీకి కొత్తగా 18 మంది ఎమ్మెల్సీలు రానున్నారు. పార్టీ కోసం సేవ చేసి..పదవులు దక్కని వారికి ఈ సారి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీ – ప్రభుత్వంలో అనుభవం ఉన్న వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులుగా తీసుకోవాలని నిర్ణయించిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత కేబినెట్ విస్తరణకు అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ ఎవరి పైన వేటు వేస్తారు..ఎవరికి కేబినెట్ లో సీటు ఇస్తారనేది ఉత్కంఠకు కారణమవుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇదే కసరత్తులో బిజీగా ఉన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావటం కోసం పని తీరు ప్రామాణికంగా సీఎం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు..