నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతోన్న ఐటీ హబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్‌తోపాటు అనేక టైర్ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతోన్న ఐటీ హబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్‌తోపాటు అనేక టైర్ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. నిజామాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌లో సదుపాయాలపై నిర్వహించిన వెబినార్‌లో కవిత పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేయడానికి లాండ్ బ్యాంక్ అందుబాటులో ఉండటంతో పాటు, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నిజామాబాద్‌లో ఐటీ విద్యనందించే అనేక విద్యా సంస్థలతో పాటు, కోచింగ్ సంస్థలు కూడా ఉన్నాయన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, డిప్లొమా విద్యార్థులకు సైతం మెరుగైన అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
స్థానిక యువతకు ఐటీ ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నిజామాబాద్ నగరంలో ఐటీ హబ్ మంజూరైందని బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ‘నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతున్న ఐటీ హబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఐటీ హబ్ భవనం అన్ని హంగులతో ముస్తాబైంది. ఐటీ హబ్‌లో వివిధ దేశాల కంపెనీలను తీసుకురావడానికి అమెరికాలోని అట్లాంటా, న్యూజెర్సీ, డల్లాస్, వాషింగ్టన్ డీసీ, చికాగో నగరాల్లో పర్యటించి ఐటీ హబ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన ఐటీ కంపెనీలు ఇక్కడికి రానున్నాయి’ అని ఆయన వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాని సీఎం కేసీఆర్ చొరవతో అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఐటీ హబ్‌తో నిజామాబాద్ జిల్లాలోని వెయ్యి మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. జిల్లాకు చెందిన చాలా మంది ఇతర దేశాల్లో, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గణేష్ బిగాల పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతున్న ఐటీ హబ్‌తో స్థానికులకు ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన వివరించారు.