Agriculture

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సుప్రీం గ్రీన్​ సిగ్నల్​

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సుప్రీం గ్రీన్​ సిగ్నల్​

న్యూ ఢిల్లీ : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టులో చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతులు 7.15 టీఎంసీల ఉపయోగించుకోవటానికి సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకు కోవాలని స్పష్టం చేసింది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొకుండా ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం సూచించింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై మాత్రం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం స్టే విధించింది.అయితే పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటి జరిమానా విధిస్తూ.. ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్​ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపించింది. తాజాగా ప్రజల తాగునీటి అవసరాలకు అవసరమయ్యే విధంగా 7.15 టీఎంసీల నీటి వరకు మాత్రమే పనులకు అనుమతిని ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ప్రతివాదులందరికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో ప్రతివాదులు అంతా.. కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని, ఆ తర్వాత ఆరు వారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్‌లు దాఖలు చేయాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టులో చేపట్టనున్నట్లు తెలిపింది.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. పిటిషనర్​ వాదనలను వినాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అప్పుడు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హిమాకోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రెండు వారాలకు వాయిదా వేసింది. ఇంకా ఆ తీర్పు కాకముందనే తాజాగా సుప్రీంకోర్టు పాలమూరు- రంగారెడ్డికి అనుమతులు ఇచ్చింది.