Devotional

మహాశివరాత్రి విశిష్టత ఏమిటి? ఈరోజు శివుని పుట్టినరోజా?

మహాశివరాత్రి విశిష్టత ఏమిటి? ఈరోజు శివుని పుట్టినరోజా?

భగవంతునికి పుట్టినరోజు అనేది ఉండదు… ఎందుకంటే ఆయనకు పుట్టుకే లేదు గనుక. పైగా శివునికి స్వయంభూ, ఆత్మభూ అని పేర్లున్నాయి. తనంత తాను కలిగిన వాడు అని. కలిగిన వాడు, ఉన్నవాడు అని రెండున్నాయి. భగవంతుడు ఎప్పుడూ ఉన్నవాడే. కానీ జగతిని అనుగ్రహించడం కోసం తనను తాను వ్యక్తం చేసుకుంటాడు. వ్యక్తం అవడాన్నే కలగడం అంటారు. అందుకే శివునికి ‘భవుడు(కలిగినవాడు) అని ఒక పేరు ఉన్నది.
మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటంటే సృష్ట్యారంభమునందు పరమాత్మ తనను తాను ఒక దివ్యమైన అగ్నిస్తంభాకృతిగా ప్రకటించుకున్నాడు. అది వ్యక్తమవడం. అలా వ్యక్తమైన రోజు మహాశివరాత్రి అని చెప్పబడుతున్నది. కనుక ఇది పుట్టినరోజు అని సరదాగా అనుకోవచ్చు కానీ, భగవంతుడు తనకు తాను ప్రకటించుకున్న రోజు అని భావించవచ్చు.
దీనికి సంబంధించి పురాణ కథ… బ్రహ్మవిష్ణువుల నడుమ పరమేశ్వరుడు ఒక మహాలింగంగా ఆవిర్భవించి తన ఆదిమధ్యాంత తత్త్వాన్ని ప్రకటించాడు అని చెప్తున్నారు. అయితే పురాణాలలో కించిత్ అభిప్రాయ భేదం కనిపిస్తోంది. ఒకటి మాఘ బహుళచతుర్దశి అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు అని కొన్ని పురాణాలలో కనబడుతున్నది. కానీ మహాశివరాత్రికి సంబంధించిన అంశాలలో శివపురాణంలో మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రం నాడు పరమేశ్వరుడు ఒక మహాగ్నిలింగంగా ఆవిర్భవించాడు. అని చెప్పారు. ఆ ఉద్భవించిన మహాలింగం తుది, మొదలు తెలుసుకోవాలని బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించారు. అందులో బ్రహ్మ హంసరూపంతో పైకి వెళ్తే, విష్ణువు వరాహరూపంతో క్రిందికి వెళ్ళారని; కానీ ఉభయులూ తుది, మొదలు తెలుసుకోలేకపోయారని, వారు పరమేశ్వరునే శరణు వేడగా ఆ పరమేశ్వరుడు వ్యక్తమై వారికి తన తత్త్వాన్ని తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు – ఉభయులూ శివారాధన చేశారు. వాళ్ళు శివుని ఆరాధించిన రోజు మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయం. ఆనాటినుండి శివలింగారాధన వ్యాప్తి చెందింది. బ్రహ్మవిష్ణువుల నుండి దేవతలు, దేవతల ద్వారా ఋషులు, ఋషుల ద్వారా సమస్త ప్రపంచమూ తెలుసుకున్నది. ఈ మొత్తం చెప్తూ మనకు ప్రసిద్ధి చెందిన లింగాష్టకం ఉన్నది. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం అని. ఈ విధంగా పరమేశ్వరుడు తనను తాను వ్యక్తం చేసుకుని తన ఆరాధనను బ్రహ్మవిష్ణువుల ద్వారా వ్యాప్తి చేసిన రోజు మాఘ బహుళ చతుర్దశి. సంవత్సర కాలం శివారాధన చేసిన ఫలితం ఈ ఒక్క రోజు ఆరాధన వల్ల ఫలిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తున్నది. అది మహాశివరాత్రి విశిష్టత.

[బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానం]