ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన కన్నా
ఏ పార్టీలో చేరతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి
జనసేనలో చేరతారంటూ ప్రచారం
చివరికి టీడీపీ వైపు మొగ్గు
ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం
గుంటూరు, సూర్య ప్రధాన ప్రతినిధి : ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ త్వరలోనే టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కన్నా పసుపు కండువా కప్పుకోనున్నారు. కన్నాతో పాటు ఆయన ముఖ్య అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీలో చేరే రోజున ఉదయం తాను సెంటిమెంట్ గా భావించే అమరావతి దేవాలయంలో కన్నా ప్రత్యేక పూజలు చేయనున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కాగా కన్నా చేరికకు టీడీపీ హైకమాండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. టీడీపీలో చేరిన తర్వాత కన్నాకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు.
అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పటినుంచో కోవెలమూడి రవీంద్ర ఉన్నందున, కన్నాను సత్తెనపల్లి బరిలో దించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. సత్తెనపల్లిలో కాపు ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్నందున, కన్నా ప్రభావం అక్కడ పనిచేస్తుందని టీడీపీ భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాగా గత డిసెంబరులో కన్నా లక్ష్మీనారాయణను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కలవడంతో కన్నా జనసేనలో చేరే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే, బీజేపీకి రాజీనామా చేశాక కన్నా టీడీపీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.