కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలిలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి. ఇక్కడి వేణుగోపాల స్వామి స్వయంభువుగా చెప్తారు. ఒకసారి సీతారామయ్య కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిలో మట్టికావాల్సి తమ పనివానికి పెరట్లో కాస్త తవ్వి మట్టి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ నౌఖరు మట్టి తవ్వుతుండగా భూమిలోంచి పిల్లన గ్రోవి ని పట్టుకొన్న స్వామివిగ్రహం పారకు తగిలిందట. ఏమిటో అని పైకి తీయగా పిల్లనగ్రోవి పట్టుకొన్న చేతిలోని చిటికెన వేలు కొద్దిగా తెగిందట. ఆ సంగతి సీతారామయ్యకు చెప్పగా ఆయన ఎంతో పారవశ్యం చెందాడు. ఆ శ్రీకృష్ణుడే మనలను ఉద్ధరించడానికి ఏతెంచాడు అని వానితో చెప్పాడు. వెంటనే స్వామి ని తెలియక చేసిన తప్పును మన్నించమని పదేపదే వేడుకున్నాడు. వెంటనే వెండి పనిచేసే వానిని పిలిచి స్వామి మూర్తికి తగిలిన గాయాన్ని మాన్చమని చెప్పి చేయించారట. స్వామి తమ ఇంట వెలిశారని ఊరందరికి తెలియచేశారట. వెంటనే తాటాకు పందిరి వేసి ఆ పందిరి మహోన్నతమైన దేవాలయంగా భావించమని వేడుకుంటూ అక్కడే వేణుగోపాల స్వామిని ప్రతిష్టించారట. ఇక ఆనాటి నుంచి వారికి కాలం కలసి వచ్చింది. ఆ తరువాత ఊరందరూ స్వామిని చూచి ఆనందంపొంది తమ తమకు కావాల్సిన కోరికలను కోరుకున్నారట. వారందరి కోరికలను స్వామి తీరుస్తూ వచ్చారట. దాంతో స్వామికి ఆనాడు వేసిన తాటాకు పందిరి స్థానంలో చక్కని దేవాలయ నిర్మాణం చేశారు. సంతానార్థులు వచ్చి వేడుకుంటే స్వామి దయవల్ల వారికి సంతానం కలుగుతోందట. ధనార్థులు వచ్చి స్వామిని వేడుకుంటే వారు ధనవంతులు కాగలుగుతున్నారట. విద్యార్థులు వచ్చి తమకు జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటే వారి చదువులో అభ్యుదయాన్ని పొందుతున్నారట. ఇలా స్వామిని ఏది కోరుకుంటే దానే్న సునాయాసంగా ఇచ్చే దేవదేవునిగా వేణుగోపాల స్వామిని ఇక్కడి భక్తులు కొనియాడుతుంటారు. ద్వాపరయుగంలో స్వామి దుష్టులను సంహరించి శిష్టులను కాపాడినట్లే ఈ కలియుగంలోకూడా స్వామి దుష్టులను దునుమాడుతూనే శిష్టులను తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. స్వామి కరుణామృతాన్ని గ్రోలాలని చుట్టుపక్కల ఊర్లనుంచే కాక ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామిని సేవిస్తుంటారిక్కడ.స్వామి మహిమలు ఇన్ని అన్నిఅని చెప్పలేనన్ని ఉన్నాయని స్వామి మహిమ అనుభవైకవేద్యం కావాలి కాని దాన్ని వర్ణించడానికి ఈ మనుజులకు సాధ్యం కాదని ఈ కృష్ణ్భక్తులు అంటున్నారు. కృష్ణాష్టమి నాడు అంగరంగ వైభోగంగా వేణుగోపాలస్వామికి జన్మాష్టమిని భక్తులు ప్రతిఏటా జరిపిస్తారట. అట్లానే దసరా నాడు పాండవులకు చేదోడు వాదోడు ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడి వారిని కురుక్షేత్ర యుద్ధరంగంలో అజేయులుగా నిలబెట్టిన వైనాన్ని పురస్కరించుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళినాడు లోకకంటకుడైన నరకుని సంహరించిన శ్రీకృష్ణుణ్ణి స్మరించుకుంటూ దీపావళి పండుగనాడు వేణుగోపాల స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. అట్లానే ప్రతి పండుగ నాడు కూడా వేణుగోపాల స్వామికి ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో అనాదిగా వస్తోంది.భక్తుల ఇచ్చిన విరాళాలతో స్వామికోసం రాజగోపురాలు నిర్మించినట్లుగానే స్వామి సన్నిధిలో భోజనశాలను, వైద్యశాలను, పొంగళ్లశాలను, కల్యాణ మంటపం, కల్యాణకట్ట, అద్దాల మండపం, విశ్రాంతి మందిరం లాంటివాటిని నిర్మించారు. ఇంకా నిత్యాన్నదానం ఏర్పాట్లను కూడా చేయాలని దేవాలయ అధికారులు ఆలోచిస్తూ న్నారు. ఇపుడుమాత్రం విశేషదినాల్లో అన్నదానాన్ని చేస్తున్నారు. స్వామి సన్నిధిలో తమ పిల్లలకు అన్న ప్రాసలు జరిపిస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారనే నమ్మకం భక్తులకు ఉన్నట్లు చెబుతారు. స్వామి సన్నిధిలో వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ వివాహం చేసుకొనేవారు నిత్య సంతోషులుగా ఉంటారనీ అంటారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాటినుంచి స్వామికి బ్రహ్మోత్సవాలను కూడా జరిపిస్తారు. రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాల స్వామికి కల్యాణోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. స్నేహితులతో ఆడిపాడిన కృష్ణస్వామిని, గోపికల మానసచోరుడి లీలలను కొనియాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలను జరిపిస్తారు. అటు సాంఘిక, పౌరాణిక నాటకాలను వేస్తూ కృష్ణ్భక్తిని ప్రచారం చేస్తున్నారు ఈ కృష్ణ్భక్తులు. నెమలి వేణుగోపాల స్వామి దర్శించిన వారికి తీరని కోరిక అంటూ ఏమీ ఉండదని ఇక్కడి స్థానికుల కథనం. ఈ నెమలి వేణుగోపాల స్వామి దర్శనానికి వెళ్లాలనుకొన్న భక్తులు ఖమ్మం విజయవాడ మార్గంలో ఉన్న మథిర కు వచ్చి అక్కడినుంచి బస్సులలో నెమలి గ్రామానికి చేరుకోవచ్చు.
~~~~~~~~~~~~~~~~~~~~~~
2023 మార్చి 5 నుంచి గంపలగూడెం మండలం నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
*5-3-2023 – ఆదివారం – అంకురార్పణ
6-3-2023- సోమవారం – శేష వాహన ఉత్సవము
7-3-2023-మంగళవారం – శ్రీ స్వామివారి తిరు కల్యాణం (రాత్రి 10గంటలకు)
8-3-2023 – బుధవారం – రధోత్సవం
9-3-2023 – గురువారం– వసంతోత్సవం
10-3-2023 – శుక్రవారం – శ్రీపుష్పయాగము