గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై వైకాపా విధ్వంసకాండ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు మంగళవారం నిరసనకు దిగారు.
గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై వైకాపా విధ్వంసకాండ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా
జిల్లావ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు మంగళవారం నిరసనకు దిగారు. పలుచోట్ల రాస్తారోకోలు చేశారు. మరోవైపు ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. “చలో గన్నవరం నేపథ్యంలో ఆ పట్టణ పరిసరాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 విధించడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. జగ్గయ్యపేటలో తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యను గృహనిర్బంధం
చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను చిల్లకల్లు వద్ద అదుపులోకి తీసుకున్నారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తిరువూరులో పార్టీ ఇన్ఛార్జి దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసును వారి నివాసాల్లో నిర్బంధించారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాసం వద్ద పోలీసులు మోహరించారు. విజయవాడలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఇంటి నుంచి కదలనివ్వలేదు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పటమట ఎన్టీఆర్ విగ్రహం వరకు తలపెట్టిన నిరసన ర్యాలీని అడ్డుకున్నారు.దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాదు పోలీసులు అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు. పామర్రు, అవనిగడ్డ, పెడన,బందరులోనూ నేతలను గృహనిర్బంధం చేశారు. తెదేపా నేతలు మాజీ ఎంపీ మాగంటి బాబు, కేశినేని శివనాథ్,
మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఎన్ఆర్ఎస్ఐ వెనిగండ్ల రాములు పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని గన్నవరం చేరుకుని పోలీసు స్టేషన్ ముందు కార్యకర్తలతో నిరసనకు దిగారు.