ఖమ్మం కవయిత్రిగా, గజల్ రచయిత్రి గానే కాక సహృదయ సాహితీ మూర్తిగా తన సాహితీ సామ్రాజ్యాన్ని ఏలిన “కలం రాణి” భైరి ఇందిర (60) గత కొంతకాలంగా మరణశయ్యపై ఉండి నిన్న మధ్యాహ్నం హైదరాబాదులో అంతిమ శ్వాస విడిచారు.
కడదాకా నిండైన ఆత్మస్థైర్యంతో జీవించి, అందరికీ స్ఫూర్తిని పంచి, “నేను పోయినప్పుడు” అనే తన వీలునామా కవితను వ్రాసుకున్న అక్షరజీవి ఇందిర.
ఖమ్మం జిల్లా ఇల్లెందులో బైరి రామ్మూర్తి – వెంకటరమణ దంపతులకు 19 డిసెంబర్ 1962న జన్మించారు, ఇల్లందు ,హైదరాబాదు, వరంగల్, లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ కూడా చేశారు.
చిన్నతనంలో తండ్రి ప్రోత్సాహంతో సాహిత్యం పై మక్కువ పెంచుకున్న, నాటి అందరి ఆడపిల్లల వలె చిన్నతనంలోనే దాంపత్య జీవితం చేపట్టారు, అయినా మొక్కవోని దీక్షతో కష్టపడి చదివి 1997లో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఎంపిక కాబడి జిల్లాలోని “మాణిక్యారం” ఉన్నత పాఠశాలలో తన ఉద్యోగ జీవితానికి శ్రీకారం చుట్టారు, విద్యాబోధనలో తనదైన అంకితభావంతో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు.
చిన్నతనం నుంచి తనలో మిళితమైన, సృజనాత్మకతతో 9వ తరగతిలోనే “ఉక్కు పిడికిళ్ళు” అనే కవిత వ్రాశారు, అలా రచనా రంగంలో అడుగులు మోపిన ఆమె 1996 నుంచి తన సాహితీ పరిమళాలను పూయించడం విస్తృతం చేశారు, తరచూ కవిత్వం రాస్తూ స్థానిక సంస్థల కవి సమ్మేళనాల్లో పాల్గొనేవారు, తనలోని అభ్యుదయ భావాలకు కవిత, మినీ కవిత, గేయం, కథ, వంటి ప్రక్రియలను వేదికలుగా చేసుకున్నారు.
చివర్లో మిత్రుల సూచనల మేరకు గజల్ రచన చేపట్టి అందరినీ అబ్బుర పరుస్తూ అనేక శక్తివంతమైన గజల్స్ రాసి ఖమ్మం “తొలి గజల్ రచయిత్రి”గా సాహితీ చరిత్రలో నిలిచిపోయారు.
వీరి రచనల్లో… అలవోకలు (2005) అభిమతం(2007) హైకు/మినీ కవితా సపుటాలు, తెలంగాణ గజల్ కావ్యం (2016) మన కవులు గజల్ (2018) ఘనచరితలు గేయ కవిత్వం (2019), ప్రధానంగా చెప్పవచ్చును.
అందమైన రూపం లాగే అందమైన మనసుగల “ఇందిర” అచిర కాలంలోనే అందరి అభిమానం పొంది, తన సాహితీ కృషికి పలు పురస్కారాలు పొందారు, సుందరమైన ఆమె జీవితం క్యాన్సర్ బారిన పడి అవిశ్రాంత పోరాటం చేసింది. ఈ సాహితీ మణి మృతికి తెలుగు రచయితలు అందరి పక్షాన నివాళులు.🙏🙏