శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము నల్లగొండజిల్లా యాదగిరిగుట్ట మండలములో మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి.
స్థల పురాణం:
ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ శ్రీ హరి ఆయుధం అయిన సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.
తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి గా వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని అంటారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు.
ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ.
ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో లక్ష్మీ నరసింహస్వామి గా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.
రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.
చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.
మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ ముఖద్వారం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలొ ప్రముఖ మైన దివ్య క్షేత్రం: యాదగిరి గుట్టకు సంబందించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో వున్నది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడ అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి “ఏంకావాలో కోరుకో” మంటే యాదర్షి స్వామి వారికి “శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది.
🕉️🚩🕉️🚩🕉️