వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో పోటీ చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్దుల పోటీలోకి భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చేరారు.
వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం డెమోక్రాట్ల చేతిలో ఉన్న అధికారాన్ని తిరిగి సొంతం చేసుకునేందుకు రిపబ్లికన్లు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే భారతీయ మూలాలున్న నిక్కీ హేలీ రిపబ్లికన్ అభ్యర్ధి రేసులో చేరగా, ఇప్పుడు మరో భారతీయుడు వివేక్ రామస్వామి కూడా అధ్యక్ష పోరులోకి ప్రవేశించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ రేసులోకి వస్తారన్న ప్రచారం నేపథ్యంలో భారతీయుల ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరోసారి రంగం సిద్ధమవుతోంది. మూడేళ్ల క్రితం అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్, ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ పదవీకాలం ముగియనుంది. దీంతో వచ్చే్ ఏడాది జరిగే ఎన్నికల్లో తిరిగి డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధుల రేసు మొదలైంది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధుల రేసు ప్రారంభమైంది. ఇందులో భారతీయ మూలాలున్న నిక్కీ హేలీ రేసులో ఉన్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు మరో భారతీయుడు వివేక్ రామస్వామి కూడా ఇందులో చేరారు. రెండు సార్లు సౌత్ కరోలినా మాజీ గవర్నర్ ,ఐక్యరాజ్యసమితిలో మాజీ రాయబారి అయిన హేలీ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం తన మాజీ బాస్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.
అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామి రేసులో ఉన్నట్లు ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. దీంతో వివేక్ అభ్యర్ధిత్వంపై రిపబ్లికన్లతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలంటే అత్యంత కఠినమైన చర్చల్ని, విపక్షాల మాటల దాడుల్ని తట్టుకోవాల్సి ఉంది. అంతే కాదు భారీగా డబ్బు కూడా ఖర్చుపెట్టాల్సి ఉంది. దీంతో వివేక్ రామస్వామి ఇప్పుడు ఈ పోరును తట్టుకోగలరా అనే చర్చ మొదలైంది.
ఎవరీ వివేక్ రామస్వామి ?
రెండవ తరం భారతీయ అమెరికన్ అయిన వివేక్ రామస్వామి 2014లో రోవాంట్ సైన్సెస్‌ను స్థాపించారు. 2015,2016లో అతిపెద్ద బయోటెక్ ఐపీఓలకు నాయకత్వం కూడా వహించారు. అమెరికాలో ఎఫ్.డి.ఎ ఆమోదిత ఉత్పత్తుల ట్రయల్స్ ను కూడా విజయవంతంగా నిర్వహించిన చరిత్ర ఆయనకు ఉంది. పలు హెల్త్‌కేర్,టెక్నాలజీ కంపెనీలను స్థాపించారు.2022లో స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ను ప్రారంభించారు. రాజకీయాలపై దృష్టి సారించడానికి ప్రముఖ కంపెనీలు అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో పౌరుల గొంతులు వినిపించడం కోసం ఆయన ఈ సంస్ధను స్ధాపించారు.అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని,కానీ అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి, మనం మొదట అమెరికా అంటే ఏమిటో మళ్లీ తెలుసుకోవాలని రామస్వామి చెప్తున్నారు. ఈ దేశాన్ని మెరిటోక్రసీ నుండి స్వేచ్చా వాక్ స్వాతంత్ర్యం వరకు, కులీనతపై స్వపరిపాలన వైపు నడిపిస్తానని అంటున్నారు.