ఎంఎస్ ధోనీ చెన్నై చెపాక్ స్టేడియంలో ఆడబోతుండటంపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ ఆనందం వ్యక్తం చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ మొదలు కానుంది. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా సొంత మైదానాల్లో మ్యాచ్‌లు జరగని విషయం తెలిసిందే. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో.. ఈసారి హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లను చూసే అవకాశం భారత అభిమానులకు లభించనుంది. సొంత మైదానాల్లో ఏడు మ్యాచ్‌లను ప్రతి జట్టూ ఆడుతుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ చెపాక్ స్టేడియంలో ఆడనుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‌లో ఆడడం కూడా ఇదే చివరి సీజన్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహీ కూడా ఇదే చివరి సీజన్ అని గతేడాది చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో మహీ ఎలా ఆడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధోనీ చెన్నై చెపాక్ స్టేడియంలో ఆడబోతుండటంపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ ఆనందం వ్యక్తం చేశాడు. ధోనీ ఐపీఎల్ కెరీర్ చివరి దశకు చేరుకుందన్నాడు. గతంలో హేడెన్ సీఎస్‌కే తరఫున ఆడిన విషయం తెలిసిందే.
మరోసారి చెపాక్ స్టేడియంలో ఎంఎస్ ధోనీ ఆడనుండటం అద్భుతంగా ఉండబోతోంది. గత సీజన్ చివర్లోనే తాను మళ్లీ తిరిగి వస్తానని మహీ చెప్పాడు. ఇప్పటివరకు ధోనీ చుట్టూ చెన్నై సూపర్ కింగ్స్ తిరుగుతూ ఉంది. చాలాఏళ్ల నుంచి చెన్నైను అతడు నడిపిస్తున్నాడు. ఇక ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగింపు దశకు వచ్చిందని నేను అనుకుంటున్నా. అందుకే కొన్ని మ్యాచ్‌లు అభిమానులతో పాటు చెన్నైకి కీలకంగా మారాయి. ఈ సీజన్‌లో ఎంఎస్ ధోనీ ఆటే చెన్నైకి కీలకం అవుతుంది’ అని మ్యాథ్యూ హేడెన్ అన్నాడు.
బోర్డర్-గవాస్కర్ 2023 సిరీస్‌లో ఆస్ట్రేలియా 0-2తో వెనుకబడిన విషయం తెలిసిందే. స్పిన్ మాయాజాలంతో భారత స్పిన్నర్లు ఆస్ట్రేలియాను ఆటాడుకుణారు. ఈ నేపథ్యంలో భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి తన సాయం కోరితే అందించడానికి సిద్ధంగా ఉన్నానని మాథ్యూ హేడెన్ చెప్పాడు. వంద శాతం ఆస్ట్రేలియాకు తాను సాయం చేయడానికి సిద్ధమని.. ఏ సమయంలో అయినా ఎవరితోనైనా మాట్లాడేందుకు రెడీ అని పేర్కొన్నాడు. భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు హేడెన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.