తిరుమల శ్రీవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. క్షణకాలమైనా వేంకటేశ్వరుడ్ని కనులారా చూద్దామని అనుకుంటారు. అలాంటి వారికి టీటీడీ శుభవార్త చెప్పింది.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో తెలిసిందే. వైకుంఠనాథుడి క్షణకాలం దర్శన భాగ్యం కోసం భక్తులు ఎంతగానో పరితపిస్తుంటారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సుదూరాల నుంచి తిరుమల క్షేత్రానికి చేరుకుని శ్రీనివాసుడ్ని దర్శించి పునీతులు అవుతుంటారు. అయితే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పలు రూపాల్లో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంది. ప్రతినెలా ఆన్లైన్ ద్వారా దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేసి భక్తులకు స్వామి దర్శన భాగ్యాన్ని సుగమం చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఫిబ్రవరి 22న సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో విడదుల చేయనుంది. టీటీడీ విడుదల చేయబోయే ఆర్జిత సేవా టికెట్లలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టోకెన్ల కోటా ఉండనున్నాయి. టీటీడీ రిలీజ్ చేయబోయే కోటాలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టెకెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఫిబ్రవరి 22 ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటల వరకు ఈ నమోదు ప్రక్రియ ఉంటుంది.
లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు దానికి సంబంధించిన డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. వెంకన్న భక్తులందరూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ వెల్లడించింది. ఇక, ఈ టికెట్లను బుక్ చేయాలంటే.. టీటీడీ అధికార వెబ్సైట్లోకి వెళ్లి స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఫోన్ నంబర్ నమోదు చేసి, జనరేట్ ఓటీపీని క్లిక్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి.. నచ్చిన తేదీల్లో స్లాట్స్ సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో పేమెంట్ చేయాలి.