NRI-NRT

కుల వివక్షను నిషేధిస్తూ అమెరికా సిటీ కౌన్సిల్ తీర్మానం

కుల వివక్షను నిషేధిస్తూ అమెరికా సిటీ కౌన్సిల్ తీర్మానం

అసంతృప్తి వ్యక్తం చేసిన హిందూ గ్రూపులు

కౌన్సిల్ సమావేశంలో ఆర్డినెన్స్ ప్రవేశపెట్టిన క్షమా సావంత్

అమెరికాలో ప్రస్తుతం కుల వివక్ష నుంచి రక్షణ కల్పించే చట్టాలు లేవని వ్యాఖ్య

అందుకే ఈ ఆర్డినెన్స్ ప్రవేశ పెట్టినట్లు వివరణ ఇచ్చిన భారత సంతతి సభ్యురాలు

అమెరికాలోని సియాటిల్ నగరం మంగళవారం నాడు సంచలనాత్మక తీర్మానాన్ని పాస్ చేసింది. నగరంలో కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది. వివక్ష చూపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. అమెరికాలో కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా రికార్డులకెక్కింది. అయితే, ఈ తీర్మానంపై హిందూ గ్రూపులకు చెందిన సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చట్టం చేయడం వల్ల ప్రత్యేకంగా ఓ కమ్యూనిటీకి చెడ్డపేరు తీసుకొచ్చినట్లు అవుతుందని ఆరోపిస్తున్నారు.

కుల వివక్షను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మద్దతు పలికిన వారి వాదన మరోలా ఉంది. దేశాల సరిహద్దులు దాటినా కుల వివక్ష తప్పట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ చట్టాలలో కుల వివక్ష నుంచి రక్షణ లేదని చెప్పారు. అందుకే ఈ ఆర్డినెన్స్ అవసరం ఉందని, కుల వివక్షకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం ఉండాలని చెబుతున్నారు. మంగళవారం సియాటిల్ సిటీ కౌన్సిల్ సమావేశంలో భారత సంతతికి చెందిన సభ్యురాలు క్షమా సావంత్ ఈ ఆర్డినెన్స్ ను ప్రవేశ పెట్టారు. దీనిపై ఓటింగ్ జరగగా 6-1 ఓట్ల తేడాతో ఆర్డినెన్స్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.