Politics

ఏపీలో 175 అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేస్తాం: తోట చంద్రశేఖర్‌

ఏపీలో 175 అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేస్తాం: తోట చంద్రశేఖర్‌

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు సీట్లకు బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ తెలిపారు.
బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుధవారం తొలిసారిగా గుంటూరు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు గజమాలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం గుంటూరులో తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, టీడీపీలకు ధీటుగా తృతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్‌ ప్రధాన భూమిక పోషించనున్నట్లు జోస్యం చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాల పనితీరును తోట చంద్రశేఖర్‌ తూర్పారా పట్టారు. మోడీ పాలను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీలను ఐటీ, ఈడీ, సీబీఐ వ్యవస్థలతో బీజేపీ ప్రభుత్వం లొంగదీసుకుంటున్నట్లు ఆరోపించారు.

ఏపీలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే జోన్‌, పోలవరం వంటి అనేక హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపించారు. ఏపీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతుందన్నారు.
ద్రవ్యోల్బణం పెరిగి, నిత్యావసర ధరలు నింగినంటాయని, ఫలితంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్లల్లో తెలంగాణలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే, ఏపీలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదన్నారు.
అనంతరం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు జీ చిట్టిబాబు, బీజేపీ ఎస్సీ మోర్చా నగర అధ్యక్షుడు ప్రకాష్‌, విశాఖ తూర్పు కాపు నాయకులు శ్రీనివాస్‌, మంగళగిరి నియోజకవర్గ ఎస్సీ నాయకులు ఎన్‌ శ్రీకాంత్‌, దీప, కనకవల్లీ తదితరలు తోట చంద్రశేఖర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు.