Devotional

మార్చిలో తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ, టికెట్లు బుక్ చేసుకోండి!

మార్చిలో తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ, టికెట్లు బుక్ చేసుకోండి!

TTD Rs 300 Special Entry Darshan Tickets ను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే మే నెలకు సంబంధించి అంగ ప్రదిక్షణ టికెట్లు కూడా శుక్రవారం విడుదల చేస్తారు. సీనియర్ సిటిజన్స్, వికలాంగులకు సంబంధించిన మార్చి నెల టికెట్లు నేడు విడుదలకానున్నాయి. భక్తులు టికెట్ల బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. మరోవైపు శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు కూడా మళ్లీ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రోజుకు 150 టికెట్లు అందుబాటులో ఉంటాయి.

ప్రధానాంశాలు:

  • తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక
  • రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
  • బుక్ చేసుకోవాలని సూచించిన టీటీడీ

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. మార్చి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే మే నెల అంగప్రదక్షిణ టికెట్లను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు.. అలాగే వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మార్చి నెల టికెట్లను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

మరోవైపై తిరుమలలోని టీటీడీ జేఈవో కార్యాలయంలో శ్రీవాణి ఆఫ్‌లైన్‌ టికెట్ల జారీ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో ఇప్పటికే రోజుకు 750 టికెట్లను జారీ చేయగా.. ఈ నెలాఖరు వరకు రోజుకు 150 టికెట్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. మార్చి నుంచి 1000 శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలని టీటీడీ కోరింది.

ఇదిలా ఉంటే.. దేశీయ గోజాతుల అభివృద్ధి, డెయిరీల నిర్వహణపై మహారాష్ట్రలో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తున్న టీటీడీ అధికారుల బృందం బుధవారం బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించింది. టీటీడీ జేఈవో సదా భార్గవి నేతృత్వంలోని బృందం మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బారామతిలోని ప్రఖ్యాత కృషి విజ్ఞాన కేంద్రం లో క్షేత్ర స్థాయి అధ్యయనం చేసింది. జన్యు ప్రక్రియ ద్వారా దేశీయ గోజాతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా ఈ బృందం పరిశీలించింది.

దేశీయ గో జాతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాజమాన్య పద్ధతులు, స్వచ్ఛమైన పాల దిగుబడికి అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది. ఇందుకు అవసరమయ్యే మౌళిక వసతులను టీటీడీ అధికారులు బృందం పరిశీలించింది. టీటీడీ గోశాలలో రోజుకు 4 వేల లీటర్ల స్వచ్ఛమైన దేశ వాళీ ఆవు పాలను దిగుబడి చేసుకోవడానికి అనుసరించవలసిన విధానాలపై అక్కడి అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించారు.

బారామతి కృషి విజ్ఞాన కేంద్రంలో పశువైద్యం, హార్టీకల్చర్, అగ్రికల్చర్, ఫ్లోరీకల్చర్ పై రైతులకు నూతన మెళకువలు, సాంకేతికను జోడించి సంప్రదాయ వ్యవసాయం చేయడంపై నిపుణులు శిక్షణ ఇస్తూఉంటారు. టీటీడీ గోఆధారిత ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తూ, వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారుల బృందం అక్కడి శిక్షణా తరగతుల తీరును పరిశీలించింది. రైతులను సంప్రదాయ వ్యవసాయం వైపు ప్రోత్సహించడానికి అక్కడి అధికారులు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనేక అంశాలపై అధికారులతో చర్చించారు.