స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్‍గా మొదలయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 23, గురువారం) ఫ్లాట్‍గా షురూ అయ్యాయి. కిందటి ట్రేడింగ్ సెషన్‍లో భారీ నష్టాలను చూసిన సూచీలు నేడు స్వల్ప ప్రతికూలతతోనే ఓపెన్ అయ్యాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 63.77 పాయింట్లు కోల్పోయి 59,681.21 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 19.70 పాయింట్లు క్షీణించి 17,534.60 వద్ద కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనా ఆందోళనతో అమెరికా మార్కెట్లు బుధవారం ప్రతికూలంగానే స్పందించాయి. నేడు ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగానే ఉన్నాయి.
టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్
సెషన్ ఆరంభంలో లాభపడిన గెయిల్, గుజరాత్ గ్యాస్, హెచ్‍సీఎల్ టెక్, ఇండియన్ హోటల్స్, ఓఎన్‍జీసీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. జీ ఎంటర్‌టైన్‍మెంట్, డాక్టర్ లాల్ పత్ ల్యాబ్స్, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్, యునైటెడ్ బేవరేజెస్ టాప్ లూజర్లుగా ఓపెన్ అయ్యాయి.
అమెరికా మార్కెట్లు
US Markets: ఫెడ్ వడ్డీ రేటు పెంపు ఎలా ఉంటుందోనన్న ఆందోళన అమెరికా మార్కెట్లలో కొనసాగింది. బుధవారం సెషన్‍లో డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 84.5 పాయింట్లు కోల్పోయి 33,045.09 వద్ద స్థిరపడింది. ఎస్&పీ 500 ఇండెక్స్ 6.29 పాయింట్లు నష్టపోయి 3,991.05 వద్ద ముగియగా.. నాస్‍డాక్ కంపోజైట్ 14.77 పాయింట్లు పెరిగి 11,507.07 వద్ద స్థిరపడింది. ఎస్&పీ 500 వరుసగా నాలుగు సెషన్లలో నష్టాలనే చూసింది.
మిశ్రమంగా ఆసియా మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ఉన్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు అంచనాలు ఆసియాపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు నేడు నష్టాలతో ఓపెన్ అయ్యాయి. అయితే దక్షిణ కొరియా సూచీలు స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఇక జపాన్ మార్కెట్‍కు నేడు సెలవు.
భారీగా పడిన క్రూడ్ ధర
గత 24 గంటల్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పడింది. ఏకంగా 3 శాతానికి పైగా తగ్గగా.. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 80.60 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణిస్తే అది భారత్‍కు సానుకూలంగా ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా మెరుగై రూ.82.77 వద్ద ఉంది.