ఎంపీ రఘురామరాజు కేసుల్లో హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఎంపీ రఘురామరాజు కేసుల్లో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలని పోలీసులకు సూచించింది.పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ రఘురామ రాజు పైన నమోదు చేసిన రెండు కేసుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ప్రధాన వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నిర్దేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర..కాళ్ల పోలీసు స్టేషన్లలో గతఏడాది ఫిర్యాదుల ఆధారంగా ఎంపీపై కేసులు నమోదు చేసారు. వాటిని కొట్టేయాలని కోరుతూ ఎంపీ రఘురామ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. వీటి విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ పిటీషన్లపై హైకోర్టులో ఎంపీ రఘురామ తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ నెల 24న జరగనున్న గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలంటే ఈ కేసులు అవరోధంగా ఉన్నాయని పేర్కొన్నారు.గతంలో రఘురామ పైన దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేసి..చిత్రహింసలకు గురి చేసారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్న కారణంగానే తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని కోర్టుకు వివరించారు. రఘురామను అరెస్టు చేయకుండా..తొందరపాటు చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలివ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది కోరారు. పోలీసుల తరపున అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో దుర్భాషలాడొద్దని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ సాగుతోందని వివరించారు.
గవర్నర్ ప్రమాణ స్వీకారానికి మౌఖికంగా ఆహ్వానం ఉందే కానీ, రాత పూర్వకంగా లేదన్నారు. ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడేందుకు వీలున్న అన్ని కేసుల్లో తప్పనిసరిగా 41ఏ నోటీసు ఇవ్వాలని ఆర్నేష్ కుమార్ కేసులో చెప్పలేదన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించేందుకు పోలీసులు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రస్తుత వ్యాజ్యాల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని కోరారు. కౌంటర్ వేయటానికి సమయం అడిగారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం రాతపూర్వకంగానే ఉండాల్సిన అవసరం లేదన్నారు. అరెస్టుపైన పిటీషనర్ కు ఆందోళన ఉన్న కారణంగానే హైకోర్టును ఆశ్రయించారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని ఆదేశించారు.