Business

విప్రో కీలక నిర్ణయం.. సగం జీతానికి పనిచేయండంటూ సందేశాలు

విప్రో కీలక నిర్ణయం.. సగం జీతానికి పనిచేయండంటూ సందేశాలు

విప్రోలో ఉద్యోగం.. ఏడాదికి రూ. 6 లక్షలకు పైగా జీతం.. ఇక చాలు.. విధుల్లో చేరగానే ఇంట్లో వాళ్లకు చెప్పి మంచి పెళ్లి సంబంధం చూడమనాలి..” ఉద్యోగానికి ఎంపికైన ప్రతి ప్రెషర్ ఇలాంటి కలలే కంటారు. లేదంటే వచ్చే జీతంతో బాగా ఎంజాయ్ చేయాలని ఊహించుకుంటారు. అలాంటి వారికి విప్రో కంపెనీ కోలుకోలేని షాకిచ్చింది. ముందు చెప్పినట్లు అంత జీతం ఇవ్వట్లేము.. సగం జీతానికి అయితే ఓకే అంటూ ఈ- మెయిల్స్ పంపింది.

రోజులు గడుస్తున్నా కొద్దీ ఐటీ కంపెనీల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణం సాకులుగా చూపి.. ఇప్పటివరకు ఉద్యోగుల తొలగింపుపై శ్రద్ధ వహించిన కంపెనీలు, ఇప్పుడు ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు శ్రీకారం చుట్టాయి. ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో తీసుకున్న చర్యలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మొదట రూ.6.5 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.3.5 లక్షలతో సరిపెట్టుకోమంటోంది. ఈ మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్‌కు ఈ-మెయిల్స్‌ ద్వారా సందేశాలు పంపించింది.

2022-23 సంవత్సరానికి వెలాసిటీ విభాగంలో పనిచేసేందుకు ప్రెషర్లను రిక్రూట్ చేసుకుంది.. విప్రో. ఈ సమయంలో వీరికి 6.5 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని ఆఫర్ చేసింది. వీరికి ఇప్పటికే శిక్షణ పూర్తవగా, 2023 మార్చి నుంచి విధుల్లో చేరనున్నారు. ఇలాంటి సమయంలో ఆఫర్ చేసిన ప్యాకేజీ కాకుండా.. తక్కువ మొత్తానికి పనిచేయాలంటూ విప్రో నుంచి సందేశాలు వచ్చినట్లు సమాచారం. ముందుగా ఆఫర్ చేసినట్లు 6.5 లక్షలు కాకుండా.. రూ.3.5 లక్షలు అందిస్తాం.. ఇందుకు మీ అభిప్రాయం ఏమిటో సోమవారంలోపు తెలపాలంటూ ప్రెషర్లకు సందేశాలు వచ్చినట్లు ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది

“అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో, కొత్త ఐటీ ప్రాజెక్టులు రావడానికి ఆలస్యం అవుతోంది. కావున తాము తొలుత ఆఫర్ చేసిన వార్షిక వేతన ప్యాకేజీ రూ.6.5 లక్షలు కాకుండా.. రూ.3.5 లక్షలు అందిస్తాం.. ఇందుకు అంగీకరిస్తే తక్షణం విధుల్లో చేరవచ్చు..” అని సందేశాలు వచ్చినట్లు సారాంశం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే పదివేలని ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ అంగీకరించినట్టు సమాచారం. కాగా, విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజెన్ల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విప్రో తమ జీవితాలతో ఆడుకుంటోందని, ఆన్‌బోర్డింగ్ కోసం ఏడాదికిపైగా ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి సందేశాలు రావడం దురదృష్టకరమంటూ తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.