Sports

బుమ్రా గాయంపై షాకింగ్ అప్‌డేట్.. ఐపీఎల్ కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా మిస్సవుతాడా?

బుమ్రా గాయంపై షాకింగ్ అప్‌డేట్.. ఐపీఎల్ కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా మిస్సవుతాడా?

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనంపై షాకింగ్ వార్త వినిపిస్తోంది. గతేడాది వెన్నునొప్పితో భారత జట్టుకు దూరమైన అతను.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20ల్లో కనిపించాడు. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బౌలింగ్ చేసిన తర్వాత మళ్లీ ఈ నొప్పి తిరగబెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుంచి జట్టుకు దూరంగానే ఉంటున్న బుమ్రా.. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు జట్టుతో కలుస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు.

ఆసీస్‌పై ఆడతాడనుకుంటే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న టెస్టులు ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. దీనిలోనే బుమ్రా పునరాగమనం చేస్తాడని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఈ సిరీస్‌కు ప్రకటించిన జట్టులో కూడా బుమ్రా పేరు లేదు. దీంతో అతను ఐపీఎల్‌లోనే మళ్లీ బౌలింగ్ చేస్తాడని కొందరు అన్నారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు అతను ఐపీఎల్ కూడా ఆడటం కష్టమేనట. ఇంకా గట్టిగా మాట్లాడితే జూన్‌లో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో కూడా బుమ్రా ఆడటం కుదరదని అంటున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా..?
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం దాదాపు ఖాయమైంది. ఆసీస్‌పై మరొక్క మ్యాచ్ గెలిస్తే భారత్ ఈ టోర్నీ ఫైనల్ చేరినట్లే. ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ సమయానికి బుమ్రా జట్టుతో చేరతాడని అంతా అనుకున్నారు. కానీ అది జరిగేలా లేదు. అయితే బుమ్రా లేకపోయినా కూడా భారత జట్టు బాగానే రాణిస్తోంది. కానీ బుమ్రా కూడా జట్టుతో చేరితే బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది.

తొందర వద్దంటున్న బీసీసీఐ..

సుమారు ఐదు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రాకు కోలుకోవడానికి కావలసినంత సమయం ఇవ్వాలని, అంతేకానీ అతన్ని తొందరపెట్టి సమస్యలు సృష్టించకూడదని బీసీసీఐ భావిస్తోందట. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి అతను కోలుకుంటే చాలనేది బీసీసీఐ భావన. అందుకే అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించే వరకూ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఎన్సీయేలో ఉన్న బుమ్రా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడం ఇప్పుడప్పుడే జరిగేలా లేదు. కొన్నిరోజుల క్రితమే అతనికి మ్యాచ్ వర్క్‌లోడ్ సిములేషన్ నిర్వహించినట్లు సమాచారం.

ముంబైకి ఎదురు దెబ్బ..
ఈ సిములేషన్ గురించి వార్తలు బయటకు పొక్కడంతో అతను ఐపీఎల్‌లో మళ్లీ మైదానంలో దిగుతాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రక్రియలో బుమ్రా పూర్తిగా కోలుకోలేదని తేలిందట. అతను ఐపీఎల్ ఆడకపోతే ముంబై ఇండియన్స్‌కు అది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. గతేడాది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ముంబై.. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. వీటికి బుమ్రా లేని లోటు చాలా పెద్ద దెబ్బే. కానీ గతేడాది గాయం కారణంగా పూర్తిగా ఐపీఎల్ మిస్సయిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ ఈ జట్టుతో కలవడం ముంబైకి కలిసొచ్చే అంశం.