Devotional

తిరుమలలోని టిటిడి కళ్యాణ మండపాలకు మహర్దశ

తిరుమలలోని టిటిడి కళ్యాణ మండపాలకు మహర్దశ

తిరుమలలోని టీటీడీ కల్యాణ మండపాలను నూతన హంగులతో తీర్చిదిద్దేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మార్చి1వ తేదీ నుంచి కల్యాణ మండపాల బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తిరుమల క్షేత్రంలో ధనికుల నుంచి సాధారణ కూలీల వరకు చాలా మంది వివాహాలు చేసుకుంటారు. పేదవర్గాల వారికి టీటీడీ ఎన్నో ఏళ్ల నుంచి పౌరోహిత సంఘంలో సామూహిక వివాహాలను ఉచితంగా చేయిస్తున్న విషయం తెలిసిందే. ధనికులు భారీపరిమాణంలో ఉండే ప్రైవేట్‌ మఠాల్లో పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. పరిమిత కుటుంబ సభ్యుల నడుమ వివాహాలు చేసుకునేలా టీటీడీ మధ్యతరగతి భక్తులను దృష్టిలో పెట్టుకుని కాటేజీల్లో కల్యాణ మండపాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే వీటి నిర్మాణం జరిగి దాదాపు 40 ఏళ్లకుపైగా కావడంతో ప్రస్తుతం అవి కొంత దెబ్బతిన్నాయి. వీటిలో వివాహం చేసుకునే భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. ఈ క్రమంలో తిరుమలలో టీటీడీ పరిధిలో ఉన్న ఏడు కల్యాణ మండపాలను అభివృద్ధి చేయాలని ఈవో ధర్మారెడ్డి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈమేరకు శంకుమిట్ట కాటేజీల్లోని 226ఏ, 226బీ, 237ఏ, 237బీ, 248ఏ, 248బీ, ఆళ్వార్‌ట్యాంక్‌ కాటేజీలోని 99నెంబరు కల్యాణ మండపాలను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వాటర్‌ లీకేజీలను అరికట్టడం, నూతన టైల్స్‌ వేయడం, వివిధ సౌకర్యాలతో బాత్‌రూమ్‌లను అభివృద్ధి చేయడం, పగుళ్లను గుర్తించి మరమ్మతులు వంటి పూర్తిచేసి రెండు నెలల్లో తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కో కల్యాణమండపానికి దాదాపు రూ.20 లక్షల నిధులను కేటాయించారు