Politics

ఆపరేషన్ తెలంగాణ.. గెలిచి తీరాల్సిందేనన్న అమిత్ షా

ఆపరేషన్ తెలంగాణ.. గెలిచి తీరాల్సిందేనన్న అమిత్ షా

BJPవిభేదాలు, గొడవల్ని పక్కన పెట్టి తెలంగాణలో గెలుపే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని పార్టీ నాయకులకు అమిత్‌షా తేల్చి చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అనుకూల వాతావరణం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని నేతలకు స్పష్టం చేశారు.
BJP ఈ ఏడాది తెలంగాణలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నాయకులకు స్పష్టం చేశారు. నేతలంతా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యనేతలకు దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణలో ఇంటింటికి బీజేపీని చేేర్చే లక్ష్యంతో 2023 శాసనసభ ఎన్నికల ప్రధాన ఎజెండాను రూపొందించారు. ‘ఇకపై తన దృష్టి అంతా తెలంగాణ పై ఉంటుందని, తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా నాయకులంతా ముందుకు సాగాలని, పాత, కొత్త నేతలనే తేడాలు వద్దని అభిప్రాయభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీలో చేరికలను ప్రోత్సహించాలని సూచించారు.

ఈ ఏడాది జరిగే కర్ణాటక, తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించినట్లు అమిత్ షా వివరించారు. రెండు రాష్ట్రాల్లో మొదటి ప్రాధాన్యం తెలంగాణకేనని నేతలకు అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని లక్ష్యం విధించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నివాసంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అత్యవసర కోర్‌ కమిటీ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు.

ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం…..
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేందుకు ఏడు నెలల సమయం ఉందని.. ఈ క్రమంలో ప్రతి పదిహేను రోజులకొకసారి కోర్‌ కమిటీ భేటీ కావాలని, వీలును బట్టి తాను కూడా హాజరవుతానని చెప్పారు.

తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించాలని, ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ సభల ముగింపు నేపథ్యంలో అతిపెద్ద సభను ఏర్పాటు చేసి ప్రధాని మోదీని ఆహ్వానించాలన్నారు. రాష్ట్రంలో పార్టీ ముందుకు వెళ్లాల్సిన అంశాలపై పలు సూచనలు చేయడంతో పాటు నాయకులంతా కలిసి సాగాలంటూ హెచ్చరించారు.

పార్టీలో చేరికలు ఆశించిన స్థాయిలో లేవని,వాటిపై దృష్టి సారించాలని అమిత్‌షా అన్నారు. వివిధ జిల్లాల్లో బలమైన నేతలు చేరేందుకు ఆసక్తి చూపుతున్నా నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు అడ్డంకిగా మారిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నేతల మధ్య ఉన్న అంతరాలు పార్టీకి నష్టం కాకూడదని, కలిసి మాట్లాడుకొని చేరికలను ప్రోత్సహించాలని హితవు చెప్పారు. నియోజకవర్గ, పూర్వపు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే సభల్లో కొత్తవారిని చేర్చుకోవాలని, వారు పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు కట్టుబడేలా కలుపుకొని పోవాలని సూచించారు. ప్రతి నియోజక వర్గంలో బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలని ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం పోరాడటానికి అనువుగా ఏ సమస్యలున్నాయి.. వాటిపై ఏ విధంగా ముందుకు వెళ్తారని అమిత్‌షా నాయకులను ప్రశ్నించారు. సమస్యలపై ఒక జాబితా రూపొందించి ఇవ్వాలని, వాటిపై ప్రణాళిక ప్రకారం ఉద్యమించాలని షా దిశానిర్దేశం చేశారు. బిఆర్ఎస్ నెరవేర్చని హామీలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

మార్చి 12న రాష్ట్రానికి అమిత్ షా…

మార్చి 12వ తేదీన తాను తెలంగాణకు వస్తానని, మరోసారి అక్కడ సమావేశమవుదామని అమిత్‌ షా తెలంగాణ నేతలకు చెప్పార. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక ఉన్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఆటంకం కలగకుండా ఆ మూడు ఉమ్మడి జిల్లాల వెలుపల సమావేశం కావాలని నిర్ణయించారు.

”ప్రజా గోస-భాజపా భరోసా” పేరుతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో చేసిన స్ట్రీట్‌కార్నర్‌ సమావేశాలు విజయవంతం కావడంపై కేంద్ర నాయకత్వం అభినందనలు తెలిపిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఢిల్లీలో చెప్పారు.

తెలంగాణ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుకుంటున్నారని, ప్రత్యామ్నాయం భాజపాయేనని భావిస్తున్నారన్నారు. నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవని సంజయ్‌ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, బరిలో నిలిచేందుకు నాయకుల మధ్య పోటీ ఉందన్నారు. గతంలో రెండు ఎంపీ సీట్లున్న తాము దేశంలో అధికారంలోకి వచ్చినట్టే .. తెలంగాణలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.