భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈరోజు తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను వివాహం చేసుకున్నాడు.
మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్
శార్దూల్ పెళ్లి ఫొటోలు, వీడియోస్ వైరల్
వన్డే ప్రపంచకప్ 2023లో కీలకం
పటేల్ తర్వాత టీమిండియా మరో ప్లేయర్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఈరోజు (ఫిబ్రవరి 27) తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను వివాహం చేసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శార్దూల్, మిథాలీకి జంటకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
శార్దూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్‌ల వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి చాలామంది అతిధులు వచ్చారు. శార్దూల్ ఠాకూర్ వివాహానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ హాజరయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం సభ్యుడు అభిషేక్ నాయర్ తదితరులు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. రెండేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.
శార్దూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్‌ల పెళ్లి ఈరోజే అయినప్పటికీ.. కొద్ది రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మెహందీ, హల్దీ ఫంక్షన్‌లతో ఇద్దరు బిజీగా ఉన్నారు. హల్దీ వేడుకలో శార్దూల్ ఓ కర్రాడితో కలిసి మాస్ డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా శార్దూల్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నేతృత్వంలో కొత్త జంట కాలు కదిపింది. ఈ వేడుకలో శ్రేయాస్ అయ్యర్ సహా తన స్నేహితులతో ఎంజాయ్ చేశాడు.
త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీసులో శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో శార్దూల్ అవకాశం దక్కించుకున్నాడు. బంతితో కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో పాటు బ్యాటుతో విలువైన పరుగులు చేస్తుంటాడు. అందులకే ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో కూడా జట్టుకు కీలకం కానున్నాడు. శార్దూల్ ఠాకూర్ భారత్ తరఫున 8 టెస్టులు, 34 వన్డేలు, 26 టీ20లు ఆడాడు.