Devotional

తినే కొద్దీ తినాలనిపించే సత్యదేవుని ప్రసాదం

తినే కొద్దీ తినాలనిపించే సత్యదేవుని ప్రసాదం

అన్నవరం సత్యదేవుడు ఎంతటి మహిమాన్వితుడో… ఆయన ప్రసాదం అంత మధురం. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడి ప్రసాదాన్ని అత్యంత ఇష్టంగా స్వీకరిస్తారు. ఎవరైనా ఇదిగో అన్నవరం ప్రసాదమని ఇస్తే ఇంకొంచెం తేవాల్సింది అని నిర్మొహమాటంగా అడుగుతారు.

కోల్కత్తా నుంచి కొచ్చిన్ వరకు వెళ్లే ఏ వాహనమైనా సత్యదేవుడి గుడి ముందు ఆగాల్సిందే అక్కడ ప్రసాదం కొని తీరాల్సిందే. ఈ ఆలయంలో సగటున రోజూ ఐదు టన్నుల ప్రసాదం విక్రయమవుతుంది. తినే కొద్దీ తినాలనిపించే ఈ ప్రసాదం తయారీ వెనక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి.

ప్రసాదం తయారీకి ఇత్తడితో తయారు చేసిన పెద్ద పెద్ద కళాయిలను వాడతారు. ఒక కళాయిలో 78 కేజీల ప్రసాదం తయారవుతుంది. దీనికి 15 కేజీల గోధుమనూక, 30 కేజీల పంచదార, 6 కేజీల నెయ్యి, 100-150 గ్రాముల యాలకుల పొడి వినియోగిస్తారు.

ముందుగా కళాయిలో 40-45 లీటర్ల నీటిలో 15 కేజీల గోధుమనూకనుబాగా ఉడికిస్తారు. తర్వాత ఇందులో పంచ దార వేసి కాసేపటి తర్వాత నెయ్యి వేసి బాగా కలుపుతారు. కాసేపటి తర్వాత బాగా ఉడికి ప్రసాదం తయారవుతుంది.

దీన్ని ప్రత్యేక పళ్లల్లో పోసి కాసేపు ఆరబెడతారు… తర్వాత నాణ్యమైన విస్తరాకుల్లో పొట్లాలు కడతారు.

దేవస్థానం యాజమాన్యం ఈ ప్రసాదం కోసం గోధుమలను కొనుగోలు చేసి సొంతంగా మరపట్టే ఏర్పాట్లు చేసుకుంది.