Editorials

నలంద విశ్వవిద్యాలయం: ప్రపంచాన్ని మార్చేసిన ప్రాచీన భారతీయ యూనివర్సిటీ విశిష్టత ఏమిటి? ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ కన్నా 500 ఏళ్ల ముందు నుంచే ఉన్న నలందను ధ్వంసం చేసింది ఎవరు?

నలంద విశ్వవిద్యాలయం: ప్రపంచాన్ని మార్చేసిన ప్రాచీన భారతీయ యూనివర్సిటీ విశిష్టత ఏమిటి? ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ కన్నా 500 ఏళ్ల ముందు నుంచే ఉన్న నలందను ధ్వంసం చేసింది ఎవరు?

క్రీస్తు శకం 427లో స్థాపించిన నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా చెప్తుంటారు.

మధ్య యుగాల నాటి ముఖ్యమైన విశ్వవిద్యాలయాలలో ఒకటైన నలందలో 9 లక్షలకు పైగా పుస్తకాలు ఉండేవని.. తూర్పు ఆసియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి అప్పట్లోనే 10 వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారని చరిత్ర చెప్తోంది.

వైద్యం, తర్కం, గణితం నేర్చుకోవడానికి రావడంతో పాటు ఆ కాలం నాటి గొప్ప మేధావుల నుంచి బౌద్ధాన్ని తెలుసుకునేందుకూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చేవారు. బౌద్ధానికి సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న జ్ఞానమంతా నలంద విశ్వవిద్యాలయం నుంచి వచ్చిందేనని దలైలామా కూడా ఓ సందర్భంలో చెప్పారు.

నలంద విశ్వవిద్యాలయం సుమారు 700 ఏళ్ల పాటు వర్ధిల్లింది. ఆ కాలంలో అలాంటి యూనివర్సిటీ ప్రపంచంలో ఇంకేదీ ఉండేది కాదు. యూరప్‌లోని ప్రాచీన బోలోగ్నా యూనివర్సిటీ, ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కంటే 500 ఏళ్ల ముందే నలంద విశ్వవిద్యాలయం ఉంది.

తిరుపతి పుట్టిన రోజు: ఈ నగరానికి రామానుజాచార్యులు శిలాఫలకం వేశారా?
తెలుగు – సంస్కృతం… దేశ భాషల్లో ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
తత్వం, మతాల విషయంలో నలంద విశ్వవిద్యాలయపు అభ్యుదయ ధోరణులు ఆ విశ్వవిద్యాలయం ఉనికి కోల్పోయిన చాలా ఏళ్ల తరువాత ఆసియా సంస్కృతికి ఒక రూపమివ్వడానికి దోహదపడ్డాయి.

ఈ బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త సామ్రాజ్య పాలకులు హిందువులు. అయితే, ఆ కాలంలో బౌద్ధానికి, బౌద్ధ జ్ఞానం, తాత్విక రచనలకు ఆదరణ పెరుగుతున్న విషయాన్ని గుర్తించి సానుకూలత చూపినవారు ఈ గుప్త సామ్రాజ్య పాలకులు.

వారి పాలనాకాలంలో వచ్చిన ఉదారవాద సంస్కృతులు, మతపరమైన సంప్రదాయాలు నలంద విశ్వవిద్యాలయ బహుళ విభాగ విద్యావిధానంలో కీలకంగా ఉన్నాయి. ఇవి భిన్న రంగాల్లోని విజ్ఞానంతో బౌద్ధ మేధను మిళితం చేశాయి.

నలంద విశ్వవిద్యాలయంలో ప్రాచీన ఆయుర్వేద వైద్య పద్ధతులు బోధించేవారు. అక్కడ ఈ ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్న విద్యార్థులు ఈ విధానాన్ని దేశమంతా వ్యాపింపజేశారు. నలంద విశ్వవిద్యాలయంలోని బహిరంగ ప్రాంగణాలు, వాటికి అనుసంధానంగా ఉన్న ప్రార్థన గదులు, ఉపన్యాస గదులు తరహా క్యాంపస్‌ల స్ఫూర్తితో అనేక ఇతర బౌద్ధ సంస్థలు రూపుదిద్దుకున్నాయి.

ఇక్కడి కళలు థాయిలాండ్ మతపరమైన కళలను ప్రభావితం చేశాయి. లోహ చిత్రకళ ఇక్కడి నుంచి టిబెట్, మలయన్ ద్వీపకల్పం వరకు వ్యాపించింది.

ఛత్రపతి శివాజీ ‘గ్రేట్ ఎస్కేప్’ – ఔరంగజేబ్‌ బంధించినపుడు ‘ఆగ్రా జైలు’ నుంచి శివాజీ ఎలా తప్పించుకున్నారు?
రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి

అయితే, నలంద విశ్వవిద్యాలయం గణితం, ఖగోళ శాస్త్రంలో సాధించిన విజయాలు ఆ విశ్వవిద్యాలయ ప్రభావాన్ని, వారసత్వాన్ని చిరకాలం కొనసాగించడానికి దోహదపడ్డాయి.

భారతీయ గణిత శాస్త్ర పితామహుడిగా చెప్పే ఆర్యభట్ట క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయానికి నేతృత్వం వహించినట్లు చెప్తారు.

‘గణితాన్ని మరింత సులభతరం చేయడంలో, ఆల్జీబ్రా, కేలిక్యులస్ వంటి సంక్లిష్ట గణిత విధానాలను అభివృద్ధి చేయడంలో అత్యంత కీలకమైన, విప్లవాత్మకమైన భావన అయిన సున్నాను అంకెల్లో ఒకటిగా స్థానమిచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆర్యభట్ట అని మేం నమ్ముతున్నాం’ అని అని కోల్‌కతాకు చెందిన గణితశాస్త్ర ప్రొఫెసర్ అనురాధ మిత్ర అన్నారు.

‘సున్నా లేకుండా కంప్యూటర్లు లేవు’ అన్నరామె. అంతేకాదు.. స్క్వేర్ రూట్, క్యూబిక్ రూట్ కనుగొనడం, త్రికోణమితీయ విధానాలు అభివృద్ధి చేయడం వంటి విషయాలలో ఆర్యభట్ట అగ్రగామి.

చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించడానికి సూర్యుని వెలుగే కారణమని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆర్యభట్టే.

ఆర్యభట్ట ఆవిష్కరణలు, సిద్దాంతాలు దక్షిణ భారతం, అరేబియాద్వీపకల్పంలో గణిత, ఖగోళ శాస్త్రాల అభివృద్ధికి దోహదపడ్డాయి.

తమ వద్ద ఉన్న అత్యుత్తమ ప్రొఫెసర్లు, మేధావులను నలంద విశ్వవిద్యాలయం చైనా, కొరియా, జపాన్, ఇండోనేసియా, శ్రీలంకలకు పంపించేది. తత్వం, బౌద్ధం బోధించేందుకు వారిని విదేశాలకు పంపించేవారు.

ఈ సాంస్కృతిక బదిలీ పద్ధతి ఆసియా అంతటా బౌద్ధం వ్యాప్తికి తోడ్పడింది.

నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం… ఏమిటీ కథ?
జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి

నలంద విశ్వవిద్యాలయ పురావస్తు అవశేషాలు ఇప్పుడు ‘యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం’గా గుర్తింపు పొందాయి. క్రీస్తుశకం 1190 ప్రాంతంలో తుర్కో-అఫ్గాన్ మిలటరీ జనరల్ భక్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని దోపిడీ దళాలు ఉత్తర, తూర్పు భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు.

ఖిల్జీ దళాలు పెట్టిన మంటల్లో విశ్వవిద్యాలయం మూడు నెలల పాటు తగలబడిందని చరిత్రకారులు చెప్తుంటారు. దీన్నిబట్టి ఆ క్యాంపస్ ఎంతపెద్దదో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం 23 హెక్టార్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరుగుతున్న స్థలం అసలైన క్యాంపస్‌లో ఒక చిన్న భాగం మాత్రమే. తవ్వకాలు జరిగిన ప్రదేశంలోని మఠాలు, ఆలయాల మీదుగా వెళ్తున్నప్పుడు.. ఆ ప్రదేశంలో చదువుకుని ఉంటే ఎలా ఉండేదో అన్న ఆలోచన కలుగుతుంది.

నేను అక్కడి బౌద్ధ మఠాల వాకిళ్లు, లోగిళ్లు.. ఆలయాల అంతరగృహాలలో తిరిగాను. ఎత్తయిన, ఎర్రని ఇటుక గోడల మధ్య నడుస్తూ ఒక మఠ లోపలికి చేరుకున్నాను. గుహలాంటి నిర్మాణంలో ఆ దీర్ఘ చతురస్రాకార స్థలం నేల నుంచి కొంత ఎత్తున రాతి కట్టడంపై ఉంది. ‘ఇది 300 మంది కూర్చోవడానికి వీలున్న ఉపన్యాస గది. ఇక్కడున్న ప్లాట్‌ఫాం అధ్యాపకుల పోడియం’ అని కమల సింగ్ నాతో చెప్పారు. కమల సింగ్ నాకు అక్కడ గైడ్‌గా వ్యవహరిస్తున్నారు. నేను చూస్తున్న గది ఒకప్పుడు అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన విద్యార్థులు నివసించినది.

ఇప్పుడు ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల మాదిరిగానే అప్పట్లో నలందలో ప్రవేశం దొరకడం చాలా కష్టం. అక్కడ చేరాలనుకునే విద్యార్థులను అగ్రశ్రేణి ప్రొఫెసర్లు ఇంటర్వ్యూలు చేసేవారు. అందులో విజయవంతమైతేనే ప్రవేశం దొరికేది.

అక్కడ ప్రవేశం లభించినవారు భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన గొప్ప ప్రొఫెసర్ల బోధనలు వినేవారు. విఖ్యాత బౌద్ధ బోధకులు ధర్మపాల, సిలభద్ర వంటి వారి ఆధ్వర్యంలో ఇదంతా నడిచేది.

నలంద విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో 90 లక్షల రాతప్రతులు, తాళపత్రాలు ఉండేవి. బౌద్ధ విజ్ఞానానికి సంబంధించి ప్రపంచంలోనే ఇంత పెద్ద పుస్తక భాండాగారం ఇంకెక్కడా ఉండేది కాదు. నలంద విశ్వవిద్యాలయంలోని మూడు గ్రంథాలయ భవనాలలో ఒకదాని గురించి టిబెట్ బౌద్ధ మేధావి తారానాథ్ వర్ణిస్తూ మేఘాలలో ఉండే 9 అంతస్తుల భవనంగా చెప్పారు.

విశ్వవిద్యాలయం మంటల్లో తగలబడిపోయిన తరువాత అతి కొద్ది సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు మాత్రమే మిగిలాయి. అక్కడి బౌద్ధ సన్యాసులు ఎలాగోలా వాటిని తీసుకుని పారిపోవడంతో వాటిని కాపాడుకోగలిగారు. టిబెట్‌లోని యార్లంగ్ మ్యూజియం, అమెరికాలోని లాస్ ఏంజెలిస్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో వాటిని చూడొచ్చు.

విఖ్యాత చైనా బౌద్ధ సన్యాసి, పర్యటకుడు హ్యుయాన్ సాంగ్ నలంద విశ్వవిద్యాలయంలోనే చదువుకోవడంతో పాటు అక్కడే బోధకుడిగానూ పనిచేశారు. క్రీస్తు శకం 645లో ఆయన నలంద నుంచి చైనా తిరిగివెళ్లినప్పుడు 657 బౌద్ధ ప్రతులు తనతో తీసుకెళ్లారు. హ్యూయాస్ సాంగ్ ప్రపంచంలోని గొప్ప మేధావులలో ఒకరిగా ఎదిగారు. వీటిలో కొన్నిటిని ఆయన చైనా భాషలోకి తర్జుమా చేశారు. దీని వెనుక ఉన్న ఆయన ప్రధాన ఆలోచన ప్రపంచమంతా ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించాలన్నదే. హ్యూయాన్ సాంగ్ జపనీస్ శిష్యుడు దోషో ఆ తరువాత ఈ సిద్ధాంతాన్ని జపాన్‌కు పరిచయం చేశారు. దీంతో సినోజపనీస్ ప్రాంతమంతా బౌద్ధ జ్ఞానం విస్తరించింది. అప్పటి నుంచి చైనా, జపాన్ ప్రాంతంలో బౌద్ధం ప్రధాన మతంగా మారింది. బౌద్ధాన్ని తూర్పు దేశాలకు తీసుకొచ్చిన సన్యాసిగా హ్యూయాన్ సాంగ్ గుర్తింపు పొందారు.

నలంద విశ్వవిద్యాలయం గురించి హ్యూయాన్ సాంగ్ చేసిన వర్ణనలలో మహాస్తూపం ప్రస్తావన ఉంటుంది. ఇది బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరి స్మారకార్థం నిర్మించారు. నేను ఆ అష్టభుజాకార పిరమిడ్ రూప నిర్మాణ శిథిలాల ఎదుట నిల్చున్నాను. ఈ స్మారక స్తూపం పైకి చేరడానికి ఇటుక మెట్ల మార్గం ఉంది.

‘ఈ మహాస్తూపం నిజానికి విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ముందు నుంచే ఉంది. దీన్ని క్రీస్తు శకం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించాడు. అక్కడి నుంచి 8 శతాబ్దాల కాలంలో ఈ స్తూపం అనేకసార్లు పునర్నిర్మాణానికి, పునరుద్ధరణకు నోచుకుంది’ అని ముంబయికి చెందిన చరిత్ర అధ్యాపకురాలు అంజలి నాయర్ చెప్పారు. అంజలి నాయర్ నాకు నలంద శిథిలాల దగ్గరే కలిశారు. మహాస్తూపం చుట్టూ ఉన్న చిన్నచిన్న స్తూపాలలో ఆ కాలంలో అక్కడ నివసించి, మరణించిన బౌద్ధ సన్యాసినుల చితాభస్మం ఉంటుందని ఆమె వివరించారు.

నలంద విశ్వవిద్యాలయం నాశనమైన 8 శతాబ్దాల తరువాత దాని నాశనానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలను కొందరు ఖండిస్తున్నారు. ఇస్లాం మతానికి నలంద విశ్వవిద్యలయం పోటీగా మారుతుందని భావించడం వల్ల ఖిల్జీ, ఆయన అనుచరులు దీన్ని నాశనం చేశారన్న వాదన ఇప్పటివరకు ఉండగా.. అంతకుమించి బౌద్ధాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా నలందపై దాడి జరిగిందని కొందరు మేధావులు చెప్తున్నారు.

భారతదేశంలోని గొప్ప పురావస్తు శాస్త్రవేత్తల్లో ఒకరైన హెచ్‌డీ సంకాలియా 1934లో ప్రచురించిన తన పుస్తకం ‘ది యూనివర్సిటీ ఆఫ్ నలందలో కొన్ని విషయాలు రాశారు. భారీ కోట తరహా నిర్మాణం, అక్కడున్న సంపద గురించి అప్పటికి ప్రచారంలో ఉన్న కథలు ఖిల్జీ ముఠాను దాడికి పురికొల్పి ఉండొచ్చని రాశారు.

నలందపై దండయాత్ర ఎందుకు జరిగిందో కచ్చితమైన కారణం చెప్పడం కష్టమని అక్కడి మ్యూజియం డైరెక్టర్ శంకర్ శర్మ చెప్పారు. నలంద వద్ద తవ్వకాలలో దొరికిన 350 కళాఖండాలు, 13 వేలకు మించిన పురాతన వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి.

నలంద శిథిలాల నుంచి మేం వెళ్తున్నప్పుడు ‘నలందపై అదే తొలి దాడి కాదు’ అని శంకర్ శర్మ చెప్పారు. ‘‘క్రీస్తు శకం 5వ శతాబ్దంలో మిహిర్కుల ఆధ్వర్యంలో హూణులు దీనిపై దాడి చేశారు. 8వ శతాబ్దంలో బెంగాల్ గౌడియ రాజు దండయాత్ర చేశాడు. ఆ దాడిలో విశ్వవిద్యాలయం తీవ్రంగా నష్టపోయింది’ అని చెప్పారు.

హూణులు దాడి లక్ష్యం నలందను దోచుకోవడం అయినప్పటికీ బెంగాల్ రాజు చేసిన దాడి లక్ష్యం మాత్రం వేరు. రాజు విశ్వసించే శైవ హిందూ శాఖకు బౌద్ధానికి మధ్య వైరుధ్యం కారణంగా దాడి చేశారన్న వాదన ఉంది. కానీ, ఇది నిర్ధరించుకోవడం కష్టమని శంకర్ శర్మ చెప్పారు.

అయితే, ఈ రెండు దాడుల తరువాతా కూడా అప్పటి పాలకుల సహకారంతో పునరుద్ధరణ చేపట్టారు.

‘ఖిల్జీ ఈ విశ్వవిద్యాలయంపై దాడి చేసే సమయానికి భారత్‌లో బౌద్ధం క్షీణ దశకు చేరుకుంది’ అని శర్మ చెప్పారు.

‘సుదీర్ఘ కాలంగా ఉన్న విశ్వవిద్యాలయం స్వయంగా ప్రభ కోల్పోతుండడంతో పాటు బౌద్ధ పాల వంశ పతనావస్థలో ఉండడంతో అప్పటికే నలంద ప్రాబల్యం తగ్గుతోంది. అదే సమయంలో ఖిల్జీ దాడి దానికి మరణశాసనంగా మారింది’ అన్నారు శర్మ.

అక్కడికి ఆరు శతాబ్దాల కాలంలో నలంద క్రమంగా మరుగునపడిపోయింది. 1812లో స్కాట్లాండ్‌కు చెందిన పురావస్తు అధ్యయనకర్త ఫ్రాన్సిస్ బుచానన్ హామిల్టన్ దీన్ని కనుగొనేవరకు ఆ గురుతులు వెలుగుచూడలేదు. అనంతరం 1861లో సర్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ దీన్ని పురాతన నలంద విశ్వవిద్యాలయంగా గుర్తించారు.