Movies

షూటింగ్ లో గాయపడిన సమంత..

షూటింగ్ లో  గాయపడిన సమంత..

స్టార్ హీరోయిన్ సమంతకు ప్రమాదం జరిగింది. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అందుకు సంబంధించిన ఓ ఫొటోని స్వయంగా ఆమెనే పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.

హీరోయిన్ సమంత గత కొన్ని నెలల నుంచి న్యూస్ లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. గతేడాది ‘యశోద’తో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ.. సరిగ్గా రిలీజ్ కు కొన్నిరోజుల ముందు ‘మయోసైటిస్’ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నానని బయటపెట్టింది. నడవడం, నిల్చోవడం కూడా తనకు చాలా కష్టమవుతోందని చెప్పుకొచ్చింది. దీని వల్ల షూటింగ్ లోనూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పింది. ఇప్పుడు వాటి నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న సమంత.. మరో ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. సమంత రియల్ లైఫ్ లోనూ ఓ ఫైటర్ అనే చెప్పాలి. ఎందుకంటే హీరోయిన్లు అనగానే గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తారు కదా అనేలా చూస్తారు. కెరీర్ ప్రారంభంలో అలాంటి పాత్రల్లోనే నటించిన సామ్.. ఆ తర్వాత తర్వాత స్టోరీలో ముఖ్యమైన రోల్స్ చేస్తూ వచ్చింది. గత కొన్నాళ్లలో ఆమె చేసిన ప్రాజెక్టులు చూసుకుంటే.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ పేరు తెచ్చుకుంటోంది. మరోవైపు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాజీ అనే క్యారెక్టర్ లో, ఫైట్స్ కూడా చేసి ప్రతి ఒక్కరినీ ఇంప్రెస్ చేసింది.

ఇక సమంత లీడ్ రోల్ లో నటించిన ‘శాకుంతలం’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఏప్రిల్ 14న థియేటర్లలోకి తీసుకురానున్నారు. విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చేస్తోంది. దీని షూటింగ్ కొంతవరకు కంప్లీట్ కాగా, మిగిలిన పార్ట్ కోసం త్వరలో పాల్గొంటానని చెప్పుకొచ్చింది. వీటి మధ్యలోనే ‘ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్ తీస్తున్న ‘సిటాడెల్’ రీమేక్ లోనూ నటిస్తోంది. ఇప్పుడు ఈ సిరీస్ చిత్రీకరణలో భాగంగానే గాయపడినట్లు సమంత ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది. ఇందులో తన చేతులకు బాగా గాయాలైనట్లు ఉండటం చూసి.. సామ్ త్వరగా కోలుకోవాలి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి సమంతకు ప్రమాదం జరగడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.