Devotional

బ్రాహ్మణుల ఇంట విందు.. భలే పసందు..

బ్రాహ్మణుల ఇంట విందు.. భలే పసందు..

బ్రాహ్మణుల ఇంటి భోజనము గురించి .

మీరేమన్నా అనుకోండి మాష్ఠారూ…

బ్రాహ్మణ భోజనాలు భలేగా ఉంటాయండీ! “అంటే ఏవిటయ్యా?

మిగతా భోజనాలన్నీ తేడాగా ఉంటాయంటావా!?” అని నామీద విరుచుకుపడొద్దు…

నిజం చెప్పొద్దూ.! ఇవాళ మనస్పూర్తిగా బొజ్జ పూర్తిగా నింపుకుని ఉత్తరావపోసన పట్టి.. బ్రే….వ్వ్ అనడం జరిగింది.

వర్ణన:-

మొదట చాప వేసి మమ్ములను ఆశీనులౌమన్నారు. మా ముందుగా వయసులో ఉన్న పచ్చటి అరిటాకులను వరసగా పరుచుకుంటూ వెళ్లారు.

ఆ ఆకులకు ప్రథమ సంస్కారంగా ఆకులపై నీళ్ళు చల్లారు .

వెంటనే విస్తట్లోకి “నచ్చుతానో,నచ్చనో” అని పెళ్లిచూపుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లాగా మొహమాటంగా వస్తున్న వంటకాలు .

మొదట విస్తట్లోకి జీడిపప్పు, పల్లీ సహిత పులిహోర హోరెత్తింది.

పక్కనే పరమాన్నం ప్రత్యక్షం అయింది .

పక్కన టమాట పప్పూ, శనగ నూనెలో వేయించిన అప్పడ,వడియ,చల్ల మిరపకాయలు .

వెంటనే శాఖాహారుల శాకాంబరి గుత్తి వంకాయ!

ఇంటల్లుళ్ళకు ఇష్టమంటూ బాగా ఆవ పెట్టి చేసిన పనసపొట్టు కూర .

వేసవి కాలం ఒడుగు లగ్గాల్లో ఉపనయనం అయిన పిల్లవాడిలా ముచ్చట గొలిపేలా ఉన్న అప్పుడే పెట్టిన ఆవకాయ!

దాని పక్కనే ఈర్ష్యాసూయలతో దోసావకాయ!

కోపం తో మాడిపోయిన బెండకాయ వేపుడు, శనగ పొడిలో విసిగిపోయిన దొండకాయ వేపుడు .

చివర్లో తమన్నాని తలదన్నే అందంతో అన్నమూ వచ్చాయి.

ఆగాగు తొందర పడమాకూ… అయ్యా నేనొస్తుండా…బాబూ నేనొస్తుండా…. అయ్యా నేనొస్తుండా…బాబూ నేనొస్తుండా…. అంటూ చివర్లో నెయ్యి వచ్చింది.

ఇక రాగి చెంబులో నీళ్ళిచ్చి “చిన్నగా కూర్చోండి… బాబూ” అని ఒక మాట చెప్పారు.

నా చెవులకది డైరెట్రు గారు “action “అనరిచినట్టు వినబడింది.

ఇక అవపోసన పట్టి మొదలెట్టాం.

మొదట పులిహోర తిని, తర్వాత పప్పు పని పట్టాను అప్పడంతో.

ఇంకా సగం పప్పు మిగిలి ఉంది!. నేను మొదట్నుంచీ గమనిస్తూనే ఉన్నాను ఆ టమాటపప్పు విస్తట్లోకి వచ్చినప్పటి నుంచి ఆ ఆవకాయకి లైనేస్తోంది.

ఇక ఆ ఆవకాయ్…పెట్టి ఆర్రోజులే ఐనా అప్పుడే ఆరింద ఐపోయింది. వాళ్ళ ప్రేమకి ఆ నెయ్యిగాడు కారణం ఐయ్యాడు…

ఇక నేనూరుకోలేదు… విశాల హృదయంతో ఆ రెంటినీ నెయ్యి గాడి సాక్షిగా కలిపి మింగేశాను.

“వేడి తగ్గేలోపు తొందరగా తినవయ్యా మగడా… !” అంటూ గుత్తొంకాయ ఘుమఘుమలాడింది.

దాని పని కూడా పట్టేసా…
వెంటనే బెండకాయ్ వేపుడు అందుకుంది…ఉంది కదా అని ఆ టక్కులమారి వంకాయ ని అలా లాగించేయకయ్యా… తర్వాత దురదలని మొత్తుకుంటావు.

పచ్చటి జీవితాన్ని త్యాగం చేసి వచ్చిందెవరికోసం…? నీకోసం కాదా? అంటూ నసిగింది.. దానికి దొండకాయ వత్తాసు పలికింది. ఇద్దర్ని కలిపి ఒకేసారి లాగించేసాను…

మొహమాటం తో మూల నుండి “హాయ్ బావా” అని మరదలు పిల్ల పలకరించినట్టు పనసపొట్టు కూర సిగ్గు పడుతూ అక్కడే ఉండిపోయింది…

దాని పనికూడా పట్టి ఇక పెరుగన్నం వైపు కాశి యాత్ర చేద్దాం అనుకునే లోపు…పరిగెత్తుకుంటూ వేడి వేడిగా సాంబారు బామ్మర్ది గాడు వచ్చి “అదేంటి బా అలా వెళ్లి పోతున్నావ్!? నన్ను నాలో ఉన్న ముక్కలని గ్రహించి మమ్మల్నందర్నీ ఉద్దరించండి” అని బెల్లం ముక్క తో బ్రతిమిలాడాడు…

ఏవిటో నా మీద వెర్రి అభిమానం అనుకోండి ఈ వంటకాలన్నిటికీనూ … ఓ పట్టు పట్టేదాకా ఓ పట్టాన వదల్లేదు…

చివర్లో గులాబ్ జామూన్ శోభనం పెళ్లి కూతురు లాగా వచ్చి కవ్వించింది…

దాన్ని తింటూ అల్లకల్లోలమైయున్న నా విస్తట్లోకి చూసాను..విస్తట్లో నుంచి వెలి వేసిన కరివేపాకు దీనంగా నా వైపు చూస్తే, ఆవకాయ టెంకే మోక్షం పొంది నాలో ఐక్యం ఐపోయిన భావనతో చూసింది. విస్తట్లో మిగిలిపోయిన దోసావకాయ్ నాకు తెల్సు నీకు ఆ ఆవకయంటేనే ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని ప్రేయసి లా గొడవ పెట్టుకుంది .

సగం కరచిన పూర్ణం బూరి, సగం సగం మిగిల్చిన వంటకాలు… “మాలో అర్ధ భాగమే తిని మా బ్రతుకులకి అర్ధం లేకుండా అర్ధాంతరంగా వదిలేసావ్ అంటూ అర్ధించాయి.”

ఇక నా పొట్టలో ఏ మాత్రం కాళి లేనందున ఉత్తరావపోసన పట్టి లేచి శుభ్రంగా బ్రే…వ్ అని త్రేన్చి… కాస్త అటూ ఇటూ తిరిగి ఓ కునుకు తీసాను…

అన్నధాతా సుఖీభవ🙏