Health

రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలంటున్న కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనం!

రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలంటున్న కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనం!

‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’లో అధ్యయన ఫలితాలు

కేన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చంటున్న అధ్యయనం

అస్సలు చేయకపోవడం కంటే ఎంతో కొంత చేయడం వల్ల మేలు జరుగుతుందని వెల్లడి

నడక ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శరీరానికే కాదు.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ అది ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ విషయం మరోమారు రుజువైంది. రోజూ 11 నిమిషాల నడక వల్ల చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుందని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు. నడక గుండె జబ్బులు, కేన్సర్ ముప్పును తప్పిస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు వారి తాజా పరిశోధన ఫలితాలు ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.

పెద్దలు వారంలో కనీసం 150 నిమిషాలపాటు ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు, లేదంటే 75 నిమిషాలపాటు అత్యంత తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌మెచ్ఎస్) సిఫార్సు చేస్తోంది. అయితే, అంత అవసరం లేదని, అందులో సగం చేసినా ప్రతీ పది అకాల మరణాల్లో ఒకదానిని నివారించవచ్చని అధ్యయనంలో తేలింది.

అసలేమీ చేయకపోవడం కంటే ఎంతోకొంత చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని యూనివర్సిటీ వైద్య పరిశోధన మండలి మహమ్మారుల విభాగానికి చెందిన డాక్టర్ సోరెన్ బ్రేజ్ పేర్కొన్నారు. వారంలో 75 నిమిషాల పాటు ఓ మోస్తరు శారీరక శ్రమ వల్ల గుండె వ్యాధుల ముప్పు 17 శాతం, కేన్సర్ల ముప్పు 7 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.