విదేశీయులకు కెనడా సర్కార్ తీపి కబురు చెప్పింది.
విదేశీయులకు కెనడా సర్కార్ తీపి కబురు చెప్పింది. టూరిస్ట్ వీసాపై (Tourist Visa) తమ దేశానికి వచ్చే విదేశీయులు (Foreigners) చెల్లుబాటు అయ్యే జాబ్ ఆఫర్‌ను (Job Offer) పొందినట్లయితే అలాంటివారు దేశం విడిచి వెళ్లకుండానే వర్క్ పర్మిట్ (Work Permit) కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) తాజాగా కీలక ప్రకటన చేసింది. దీనిలో భాగంగా గురువారం ముగిసిన ‘కోవిడ్- ఎరా టెంపరరీ పబ్లిక్ పాలసీ’ని (COVID-Era TemporaryPolicy) 2025 ఫిబ్రవరి 28 వరకు రెండేళ్లపాటు పొడిగించింది.
ఇక ఈ పాలసీ అందుబాటులోకి రావడానికి ముందు కెనడాలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. అక్కడికి వెళ్లడానికి ముందే వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అయితే, వర్క్ పర్మిట్ దరఖాస్తు ఆమోదించబడి, అప్పటికే టూరిస్ట్ హోదాపై కెనడాలో (Canada) ఉన్నట్లయితే అలాంటి వారికి వర్క్ పర్మిట్ రావాలంటే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చేది. కానీ, కెనడా సర్కార్ తీసుకొచ్చిన ‘కోవిడ్ ఎరా టెంపరరీ పబ్లిక్ పాలసీ’ వల్ల టూరిస్టులు దేశాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ పాలసీ నుంచి ప్రయోజనం పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకున్న రోజున టూరిస్టుగా కెనడాలో చెల్లుబాటయ్యే స్టేటస్‌ను కలిగి ఉంటే చాలు. అలాగే లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (Labor Market Impact Assessment) ఆఫర్ లెటర్ పొంది ఉండాల్సి ఉంటుంది.
ఇక ఎల్ఎంఐఏ (LMIA) అనేది ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ కెనడా (Employment And Social Development Canada)లోని ఒక భాగం. ఇది విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం వల్ల కెనడా ఆర్ధిక వ్యవస్థపై సానుకూల, తటస్థ, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందా లేదా అని అంచనా వేసే ఒక విభాగం. ఈఎస్‌డీసీ (LSDC) ప్రభావం ప్రతికూలంగా ఉందని భావించినట్లయితే సదరు యజమాని విదేశీ పౌరులను నియమించుకోవడానికి అర్హులు కాదు. ఇక ఈ పాలసీ ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ పర్మిట్ కోసం 2025 ఫిబ్రవరి 28 తర్వాత దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.