NRI-NRT

డ్రగ్స్‌ ముఠాల కంటే చైనా ప్రమాదకరం: నిక్కీ హేలి

డ్రగ్స్‌ ముఠాల కంటే చైనా ప్రమాదకరం: నిక్కీ హేలి

వాషింగ్టన్‌: అమెరికా ఇంతవరకు ఎదుర్కొన్న శత్రువుల్లోకెల్లా అత్యంత బలమైన, క్రమశిక్షణాయుతమైన ప్రత్యర్థి చైనాయేనని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్న నిక్కీ హేలి (51) హెచ్చరించారు. అమెరికా, కెనడాలపై వారం రోజులపాటు ఎగిరిన తరవాతే చైనా బెలూన్‌ను కూల్చివేశారని, ఇది జాతికి ఇబ్బందికరమైన ఘటన అన్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఏటా నిర్వహించే మితవాద రాజకీయ కార్యాచరణ సమావేశాన్ని ఉద్దేశించి హేలీ ప్రసంగించారు. అమెరికాకు ఫెంటానిల్‌ అనే మత్తు పదార్థాన్ని పంపుతున్న చైనా అన్ని మాదక ద్రవ్య ముఠాలకన్నా అత్యంత ప్రమాదకరమైనదని అన్నారు. కొవిడ్‌తో మొదలుపెట్టి అనేక సమస్యలకు చైనాను జవాబుదారీ చేయాలని ఆమె పేర్కొన్నారు. చైనాలోని వుహాన్‌ నగరం హువానాన్‌ మార్కెట్‌ నుంచి కొవిడ్‌ కారక సార్స్‌ కోవ్‌ 2 వైరస్‌ ప్రపంచమంతటికీ వ్యాపించిందన్నారు. అమెరికాలో చైనా కంపెనీలు 3,80,000 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నాయని, ఆ భూముల్లో కొన్ని అమెరికా సైనిక స్థావరాల పక్కనే ఉన్నాయని గుర్తు చేశారు. బైడెన్‌ ప్రభుత్వం దీన్ని సాగనివ్వడం నమ్మశక్యం కాకుండా ఉందన్నారు. అమెరికా విశ్వవిద్యాలయాలు మన నిధులను తీసుకుంటాయో.. చైనా నిధులను తీసుకుంటాయో తేల్చుకోవాలనీ, ఉభయుల నుంచీ తీసుకుంటామంటే కుదరదన్నారు. డెమోక్రాట్‌ అధ్యక్షుడు బైడెన్‌ హయాంలో అమెరికా అప్పుల భారం 31 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందనీ, రాగల పదేళ్లలో మరో 20 లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పులు చేయబోతున్నారని విమర్శించారు.