NRI-NRT

బ్రిటన్‌ పార్లమెంటులో రేపు రాహుల్‌ ప్రసంగం

బ్రిటన్‌ పార్లమెంటులో రేపు రాహుల్‌ ప్రసంగం

హాజరుకానున్న ఉభయసభల ఎంపీలు

లండన్‌ : భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం బ్రిటన్‌ పార్లమెంటు ఉభయసభల ఎంపీల నుద్దేశించి ప్రసంగించనున్నారు. ‘‘కేవలం రాజకీయాలపైనే కాదు, ఇరు దేశాల సాంస్కృతిక, సామాజిక, వ్యాపార బంధాలపైనా రాహుల్‌ ఉపన్యసించనున్నారని బ్రిటన్‌ ఎంపీ వీరేంద్ర శర్మ తెలిపారు. కాగా శనివారం లండన్‌లో ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాహుల్‌ ప్రసంగిస్తూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ క్రూరమైన దాడిని ఎదుర్కొంటోందని చెప్పారు. మరోవైపు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని బీజేపీ విమర్శించడాన్ని కాంగ్రెస్‌ తప్పుబట్టింది. ప్రధాని మోదీయే దేశం పరువు విదేశాల్లో తీశారని ఎదురుదాడి చేసింది. ‘‘రాహుల్‌ తన ఉపన్యాసంలో మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగం గురించి మాట్లాడారు. గతంలో చైనాలో మోడీ మాట్లాడుతూ హిందుస్థాన్‌లో ఎందుకు పుట్టామని భారత ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. మరి ఎవరు దేశం పరువు తీశారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియ ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ లండన్‌లో రాహుల్‌ చేస్తున్న ప్రసంగాలపై భాజపా శనివారం మరోసారి ధ్వజమెత్తింది. పాకిస్థాన్‌ కూడా సాహసించని విధంగా మాతృభూమిపై రాహుల్‌ విమర్శనాస్త్రాలు సంధించారని బీజేపీ నేత సంబిత్‌ పాత్ర ఆక్షేపించించారు.