నదుల అనుసంధానంపై చర్చించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై చర్చించారు. గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయని నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. డీపీఆర్‌పై ఇప్పటికే అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలిపాయన్న ఆయన తమ ప్రాజెక్టులను ఆమోదించిన తర్వాతే మిగులు జలాలను తీసుకుంటే ఇబ్బంది లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చెప్పాయన్నారు. నదుల అనుసంధానంపై హైదరాబాద్‌లోని జలసౌధలో జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరీ అనుసంధానంపై చర్చించారు. ఏపీ తెలంగాణ కేటాయింపులు కాకుండా మిగిలిన జలాలనే తరలిస్తామని ఛత్తీస్‌గఢ్ ఆమోదం తీసుకున్న తర్వాతే అనుసంధానంపై ముందుకు వెళ్తామని శ్రీరామ్ తెలిపారు. జాతీయ నదుల అనుసంధాన సంస్థ (నీరా) త్వరలో ఏర్పాటవుతుందన్నారు.
ఆరు నెలల్లో గోదావరి-కావేరీ లింక్‌పై రాష్ట్రాల ఏకాభిప్రాయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలవరం కాల్వను ఉపయోగించుకోవాలని ఏపీ ప్రతిపాదించిందని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ఎన్‌డబ్ల్యూడీఏని కోరినట్లు ఈఎన్‌సీ మురళీధర్ తెలిపారు. 50శాతం నీరు కావాలని కోరగా పరిశీలిస్తామని చెప్పినట్లు సమావేశం అనంతరం మురళీధర్ పేర్కొన్నారు. అందరి అవసరాల కోసం సమ్మక్క ఆనకట్టను వినియోగించుకుంటే బాగుంటుందని సమావేశంలో ప్రస్తావించినట్లు తెలంగాణ ఈఎన్‌సీ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రతినిధులు, టాస్క్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సీలు మురళీధర్, హరిరామ్ సమావేశానికి హాజరుకాగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ ఛైర్మన్ నవీన్ కుమార్, సభ్యులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.