Devotional

నేడు హోలీ పురాణ‌కాల ప‌ర్వం హోలీ

నేడు  హోలీ  పురాణ‌కాల ప‌ర్వం హోలీ

ఉత్తరభారతంలో హోలీని రెండు రోజుల పండగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్‌ లేదా చోటీ హోలీ అని రెండో రోజును రంగ్‌ వాలీ హోలీ. ధులేటి , ధుళంది , ధూళి వందన్‌ వంటి పేర్లతో పిలుస్తారు. వీరు రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విభేదాలను మరిచి స్నేహం పెంపొందించుకునే సమయంగా కూడా భావిస్తారు. ఈ రోజు రంగులు చల్లుకోవడంలో తెలిసినవారు , కొత్తవారు అనే భేదం లేకుండా అందరినీ వర్ణ ప్లావితం చేయడం జరుగుతుంది.

హోలీ లేదా రంగుల పండుగగా మనం జరుపుకునే పండగ అసలు పేరు హోళికా పూర్ణిమ. ఇది రెండు రోజుల పండగ అయినందున కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో రెండో రోజు చేస్తారు. ఇది ఈనాడు రంగులు చల్లుకునే ఉత్సవంగానే మారిపోయింది గాని ఈ రోజున ఆచరించాల్సిన వేరే విధి విధానాలూ ఉన్నాయి , ఉదయాన్నే కట్టెలు , పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోళికా అనే శక్తిని అవహింపజేసి ‘శ్రీ హోళికాయైనమః’ అని పూజించి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ‘వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణాశంకరేణచ , అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ’ అనే శ్లోకం చదవాలని పెద్దలు చెబుతారు. ఆ తర్వాతే రంగులను చల్లడం , రంగునీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్త్ర వచనం.
హోలీ పండగకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నిప్పుల్లో పడేసి కాల్చాలనుకోవడం అందుకు ప్ర్రహ్లాదుని అత్త హోళిక పూనుకోవడం ప్రహ్లాదునితో బాటు అగ్నిలో దూకడం కథ అందరికీ తెలసిందే. అయితే ఆమె కూడా పునీతురాలైంది కనుక హోలీ రోజు ఉదయాన్నే అగ్నిని రగిల్చి ఆమెను ఆవాహన చేయడం , హోళికాయైనమః అని స్మరించే ఆచారం వచ్చిందని అంటారు. మరో పక్క హోళిక మరణించిన తిథి ఇదే అయినందున ఈ రోజు హోలీ పండగ చేసుకుంటారని అంటారు. ఈ మంటనే చెడుపై మంచి విజయంగా కొందరు అభివర్ణిస్తారు. హోళిక చెడుకు సంకేతమని అగ్నిజ్ఞానాగ్ని అని వారి భావన.
ఉత్తర భారతంలో కృష్ణుడు పెరిగిన ప్రదేశంగా భావించే వ్రజభూమిలో మరో కథ ప్రచారంలో ఉంది. కృష్ణుడు నల్లగా ఉండడం , రాధ ఇతరులు తెల్లగా ఉండడం చూసి వారిని ఈ ఒక్క రోజు రంగులుల పూసుకుని నల్లగా మారాలని కోరాడని భావిస్తారు.

ఈ రంగులు , రంగు నీరు చల్లుకోవడంతో బాటు నృత్యగానాదులతో ఊరేగింపులు నిర్వహించడం , దీనిలో పానీయాలు అందించడం కూడా జరుగుతూంటుంది. కొన్ని ప్రాంతాల్లో భంగు కలిపిన పానీయాలు తాగి మైమరచిపోతుంటారు. హిందువుల ప్రాచీన పండగ అయిన హోలీని దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో హిందుయేతరులు సరదా పండగగా కూడా చేసుకుంటూంటారు.
ముఖ్యంగా భారత్‌ , నేపాల్‌ , ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో హిందువులు ఉన్న తావుల్లో జరుపుకోవడం జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఈ పండగను యూరప్‌ , అమెరికాల్లో సైతం నిర్వహిస్తున్నారు. అక్కడ ఈ పండగను వసంత రుతువులో వచ్చే రంగుల పండగగా అక్కడి భారతీయులు భావిస్తారు. అంతేకాక ఈ రోజు ఇతర దేశాల వారి పండగలు ఉండడంతో ఇది వాటితో కలిసి అంతర్జాతీయ పండగగా పేరు పొందింది.