తక్కువలో తక్కువగా 130 స్థానాలలో గెలిచే ఛాన్స్
శ్రీకాకుళం నుంచి కృష్ణాజిల్లా వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి, రెండు స్థానాలు దక్కే అవకాశాలు
నేరుగా ఫీజు చెల్లిస్తామని ప్రభుత్వమే కాలేజీలకు అండర్ టేకింగ్ ఇవ్వాలి
ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయ పోరాటానికి వెన్నుదన్నుగా ప్రజలు ఉండాలి
సిబిఐ విచారణ గురించి ఈనాడు ఆంధ్రజ్యోతి లను ప్రశ్నించిన సాక్షి దినపత్రిక … సిఐడి విచారణ పై తాను రాసిందేమిటో చెప్పాలి?
సిమెన్స్ నైపుణ్య శిక్షణ తరగతుల్లో డబ్బుల దుర్వినియోగమన్నది శుద్ధ అబద్ధం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన లు కలిసి పోటీ చేస్తే అప్రతిహత విజయం సాధించడం ఖాయం. ఆత్మసాక్షి సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి. టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేయాలన్నది ప్రజాభిప్రాయం. ప్రతిపక్షాల ఓటు చీలకూడదన్నది నాయకుల అభిప్రాయం కావడంతో, రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు మూడే ఉన్నాయి. మిగిలిన పార్టీల ఓటు బ్యాంకు కేవలం ఒక్క శాతమే మాత్రమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా టిడిపి, జనసేన లతో కలిస్తే, రానున్న ఎన్నికల్లో ఈ కూటమికి తిరుగు ఉండదని ఆయన అన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆత్మసాక్షి సర్వే ప్రకారం 63 స్థానాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెప్పినప్పటికీ, ఆ సంఖ్య 36, అంతకంటే తక్కువగానే ఉండవచ్చు. ప్రస్తుతం ఆత్మసాక్షి సర్వే సంస్థ, ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేసింది. టిడిపి 78 స్థానాలలో, జనసేన ఏడు స్థానాలలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్న ఆత్మసాక్షి సంస్థ. 27 స్థానాలలో హోరా హోరి గా పోరు జరిగి, 14 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 13 స్థానాలలో టిడిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించిందన్నారు. గత ఎన్నికల తర్వాత జనసేన బలం క్రమేపి పుంజుకుంది. జనసేన బలపడడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం తగ్గడం పరిశీలిస్తే… రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేనకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే విజయం సాధించిందో, అంతటి విజయాన్ని టిడిపి, జనసేన కూటమి దక్కించుకుంటుందనడం లో ఆత్మసాక్షి సర్వే సంస్థ ఫలితాలను విశ్లేషిస్తే స్పష్టం అవుతుందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. విద్యా దీవెనలు విద్యా వంచనగా మారి, అమ్మ ఒడి పథకం మరింత ఆలస్యం అయితే, ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమాల హోరు మరింత పెంచితే, గత ఎన్నికల్లో తమ పార్టీకి కలిసి వచ్చిన వైఎస్ వివేకా హత్య సానుభూతి ఓట్లు, ఈసారి రివర్స్ అయితే రాయలసీమ ప్రాంతంలో తీవ్ర ప్రభావితం చూపించే అవకాశాలు లేకపోలేదు. ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే సంఘటనలు ఆధారంగా ప్రజాభిప్రాయంలో మరింత మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదు. రానున్న ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఆత్మసాక్షి సర్వే సంస్థ వెల్లడించగా, తాను గతంలోనే కలిసి పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పానని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.
తల్లులకు ఇచ్చిన దీవెన విద్యార్థులకు ఆవేదనగా మారుతోంది
విద్యా దీవెన పథకంలో భాగంగా నగదును సకాలంలో తల్లుల ఖాతాలో జమ చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. నూతన విద్యా సంవత్సరం గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు వారికి తొలి క్వార్టర్ డబ్బును అకౌంట్లో జమ చేయలేదు. ఇక రెండవ మూడవ సంవత్సరం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇప్పటికే మూడు, నాలుగు క్వార్టర్ల సొమ్ము బకాయి పడ్డారు . ప్రభుత్వ అనాలోచిత ఆలోచనల వల్ల ఫీజులు చెల్లించనిదే, విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు పరీక్షలను రాయించడం లేదు. విద్యా దీవెన పథకంలో భాగంగా తల్లుల ఖాతాలో నగదు జమ చేసి జగనన్ననే ఈ సొమ్ము ఇస్తున్నాడని భ్రమింపజేయాలని చూశారు. ప్రజాధనంతో ఓట్ల కొనుగోలు చేయవచ్చుననే దురాలోచనతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో విద్యా దీవెన పథకం కింద సొమ్ములు చెల్లించకపోవడం వల్ల, విద్యార్థులే అష్ట కష్టాలు పడి తమ ఫీజులు తామే చెల్లించుకుంటున్నారు. తల్లుల ఖాతాలో కాకుండా, నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చి, విద్యార్థులను ఆదుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. తల్లుల మనసు దోచుకోవాలని విద్యా దీవెన పథకం పేరిట విద్యా వంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉద్యోగ ఉపాధ్యాయులకు నమ్మకం కలిగించే విధంగా ముఖ్యమంత్రి చర్చలు జరపాలి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు నమ్మకం కలిగించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారితో చర్చలు జరపాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈనెల తొమ్మిదవ తేదీ నుండి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. 9వ తేదీ నుంచి పెన్‌డౌన్, సెల్ డౌన్ కార్యక్రమాలను చేపడుతూ చివరకు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించాయి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పటివరకు రద్దు చేసింది లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకిప్పటికే ఏడు డీఏలు ప్రభుత్వం బకాయి పడింది. ఇక పీఆర్సీ విషయానికి వస్తే, మధ్యంతరంగా ఇచ్చిన పి ఆర్ సి ద్వారా ఇచ్చిన డబ్బులను, వెనక్కి తీసుకునే విధంగా తుది పి ఆర్ సి రూపొందించడం ధరిత్రి ఎరగని చరిత్ర అని రఘురామకృష్ణం రాజు అభివర్ణించారు. ఆ చరిత్రకారుడైన జగన్మోహన్ రెడ్డి వంటి వారికే ఇది సాధ్యం. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు తూచ్ అన్నారు. ఒకటవ తేదీ న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నిస్తే, తన తండ్రి కూడా బడిపంతులేనని గతంలో ఆయనకు కూడా ఒకటవ తేదీన జీతాలు వచ్చేవి కావని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకు రావడం హాస్యాస్పదం . బాత్రూమ్ ల వద్ద, మద్యం దుకాణాలను పర్యవేక్షించే బాధ్యతలు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అప్ప చెప్పడం దారుణం. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని ముఖ్యమంత్రి దాటిపోయారు. అందుకే, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పిలుపుతో కొంతమందిని పిలిచి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించడం సిగ్గుచేటు. అన్ని సంఘాల నాయకులను పిలిచి మాట్లాడితే వచ్చే నష్టం ఏమిటి. ఉద్యోగులకు ప్రభుత్వం
ఏదైనా చేస్తుందనే నమ్మకం లేదు. అలాగని ఉద్యోగులను ఉద్యమాలను చేయనిస్తుందనే గ్యారెంటీ కూడా లేదు. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో నమ్మకం కలిగించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చల్లో పాల్గొనాలని, వారితో చర్చించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.
90 శాతం మంది ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలమేనట..
90 శాతం మంది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఒకటవ తేదీన జీతాలు ఇవ్వకపోయినా, వారు దాచుకున్న పిఎఫ్ డబ్బులను లాగేసుకున్న, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోయినా ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని చెప్పడం సిగ్గుచేటు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే 60 ఏళ్లకు ఉన్న పదవీ విరమణ వయసును, 62 ఏళ్లకు పెంచారు. ఇప్పుడు 62 ఏళ్లను కాస్త 65 ఏళ్లకు పెంచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బులను దారి మళ్లించిన ప్రభుత్వం, ఇకపై జీతాలు ఇవ్వకపోతే నూటికి నూరు శాతం ఉద్యోగులు ఈ ప్రభుత్వం వెంటే ఉంటారంటూ రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. ఉద్యోగుల కోరికలో న్యాయం ధర్మం ఉంది. భవిష్యత్తులో సకాలంలో జీతాలు అందాలి అంటే గాంధేయ మార్గంలో ఉద్యమించడం మినహా మరొక దారి లేదు. ప్రభుత్వం నుంచి మాయ మాటలు తప్పితే, ఉద్యోగులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఉద్యోగులను ఇబ్బందులు పెడితే, ఆనందించే మనస్తత్వం ఉన్నవారు కొంతమంది ఉంటారు. కానీ మెజారిటీ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగుల వెంటే ఉంటారు. నాలుగు లక్షల ఉద్యోగుల కుటుంబాలను హింసిస్తే 40 నుంచి 50 లక్షల కుటుంబాల వారు సంతోషిస్తారనే భ్రమలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా కనిపిస్తోంది . కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. అంతేకానీ ప్రభుత్వ ఉద్యోగులందరినీ అవినీతిపరులుగా చూడడం సరికాదు. పాలకులు అవినీతి చేస్తున్నారు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవినీతిపరులేనని భ్రమలో కొంతమంది ఉంటే ఉండి ఉండవచ్చునని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేసే పోరాటంలో ప్రజల మద్దతు ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
బల్ల కింద దాక్కొని సాక్షి విన్నదా?
మాజీ మంత్రి నారాయణ ను సిఐడి అధికారులు విచారించగా ఆయన లేదు… తెలియదు అని సమాధానం ఇచ్చారని సాక్షి దినపత్రికలో రాయడం విస్మయాన్ని కలిగించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని సిబిఐ విచారించగా, విచారణలో అవినాష్ రెడ్డి చెప్పిన సమాధానాల కథనాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు రాశాయి. అయితే అప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఏమైనా బల్ల కింద దాక్కుని విన్నాయా?, లేకపోతే విచారణకు వీరికి ఏమైనా ప్రత్యేక అనుమతి ఉందా అంటూ సాక్షి దినపత్రిక కథనాన్ని రాసిందని గుర్తు చేశారు. మరి ఇప్పుడు సిఐడి విచారణ సమయంలో సాక్షి దినపత్రిక అదే పని చేసిందా అంటూ ప్రశ్నించారు. లేకపోతే ప్రభుత్వంలో ఉన్న సాక్షి యాజమాన్యం మాజీ మంత్రి నారాయణ ను విచారించిందా అని నిలదీశారు. సిఐడి పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు ఆదేశిస్తే కేసును స్వీకరించి దర్యాప్తు చేయాలి. సిబిఐ చేస్తున్నది అదే. గతంలో డి ఐ జి సునీల్ కుమార్ సుమోటో గా కేసులను నమోదు చేసి దర్యాప్తు జరిపారు. సునీల్ కుమార్ ఆదేశించగా, సిఐడి విభాగంలో పనిచేసిన సునీల్ కేసు నమోదు చేసి తనను అక్రమంగా అరెస్టు చేశారు. ప్రతిష్టాత్మక సంస్థ అయిన సిఐడిని తమ వ్యక్తిగత లాభం కోసం, పనికిమాలిన వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం అప్రతిష్ట పాలు చేశారు. సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలను చూసి, బాస్ హ్యాపీగా ఫీల్ అవుతారని సుమోటో గా కేసులు నమోదు చేస్తే ఏదో ఒక రోజు ఫలితం అనుభవించక తప్పదు. ఇప్పటికే సి ఐ డి చీఫ్ పదవి నుంచి సునీల్ కుమార్ ను తప్పించారు. సిఐడి విభాగం లో కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన అనుయాయులను కూడా తప్పించడం జరిగిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
సాక్షిలో రాసిందంతా పచ్చి అబద్ధం
సిమెన్స్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ప్రపంచ దేశాలలో నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పది నుంచి 12 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించింది. అయితే ఈ నైపుణ్య శిక్షణ తరగతుల విలువ మూడు వేల 300 కోట్ల రూపాయల గా అంచనా వేసింది. ఈ మొత్తం లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయ కూడా ఆ సంస్థ కు చెల్లించవలసిన అవసరమేమీ లేదు. కానీ, 300 కోట్ల రూపాయలను వెచ్చించి, విద్యార్థుల నైపుణ్య శిక్షణ తరగతుల నిర్వహణ కోసం సిమెన్స్ సంస్థ సూచించిన యంత్ర పరికరాలను కొనుగోలు చేయవలసి ఉంటుంది. సిమెన్స్ సంస్థ సూచించినట్లుగానే గత ప్రభుత్వ హయాంలో యంత్ర పరికరాలను కొనుగోలు చేసి, 12 లక్షల మంది విద్యార్థులకు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నైపుణ్య శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించారు. అయితే యంత్ర పరికరాలు సరఫరా చేసిన సంస్థ 300 కోట్ల రూపాయలకు జీఎస్టీ సరిగ్గా చెల్లించలేదు. అయితే, అది ఆ కంపెనీకి, జీఎస్టీ కి, ఈడీలకు సంబంధించిన వ్యవహారం. టిడిపి వారిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో గతంలో సిఐడి చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్, మరొక వ్యక్తి ప్రోద్బలంతో జీతం తీసుకోకుండా సేవలందించిన సుబ్బారావు అనే వ్యక్తిని అరెస్టు చేసి వేధించారు. డబ్బులను విడుదల చేసిన నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డిని మాత్రం అరెస్టు చేయలేదు. అరెస్టు చేయాలని తాను కూడా కోరుకోవడం లేదని కానీ ఆయన ప్రేమ్ చంద్ర చౌదరి అయి ఉంటే మాత్రం అరెస్టు చేసి ఉండేవారు. సిమెన్స్ కంపెనీ నుంచి డబ్బులు విడుదల కాక ముందే రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం డబ్బులు విడుదల చేసిందని సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాన్ని రాశారు. 300 కోట్ల రూపాయలను తో యంత్ర పరికరాలను సమకూరిస్తే, 12 లక్షల మంది విద్యార్థులకిచ్చే నైపుణ్య శిక్షణ తరగతుల విలువ కమర్షియల్ గా మూడు వేల 300 కోట్ల రూపాయలుగా ఉంటుందని మాత్రమే అంచనా వేశారు. ఆ విషయాలను వక్రీకరించి, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు సాక్షి దినపత్రిక తప్పుడు కథనాలను రాస్తోందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. కక్ష, హత్యా రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి మానుకుంటే మంచిదని లేకపోతే అందులో మనమే కూరుకు పోవాల్సి వస్తుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.