ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు విజయం సాధించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇటీవల కాలం వరకు మరోసారి వైసీపీనే విజయం సాధిస్తుందనే అంచనాలు ఉండగా ఒక్కసారిగా టీడీపీ–జనసేన పొత్తు వ్యవహారంతో అంచనాలు మారిపోయాయి.వివిధ సంస్థల సర్వేలు సైతం టీడీపీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల ఫలితాలను ముందుగానే దాదాపుగా కరెక్టుగా ఊహించిన ఆత్మసాక్షి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరమవుతుందని తాజాగా బాంబుపేల్చింది. టీడీపీ అధికారానికి చేరువ అవుతోందని వెల్లడించింది. వైసీపీ 68 సీట్ల దగ్గరే ఆగిపోతుందని ఆత్మసాక్షి సర్వే తేల్చింది.
ఈ సర్వే ప్రకారం టీడీపీ అధికారానికి చేరువలో ఉన్నంత మాత్రాన టీడీపీ సంబరపడటానికి ఏమీ లేదంటున్నారు. అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లకు కొంచెం అవతలే టీడీపీ నిలుస్తుందని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఈ ఏడాది పాటు భారీగానే కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు.ముఖ్యంగా వైసీపీకి కంచుకోటలు.. ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు 29 ఉండగా.. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. అంటే 36 రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ 36 రిజర్వుడ్ సీట్లలో దాదాపు 34 సీట్లను వైసీపీ తన ఖాతాలో వేసేసుకుంది.
టీడీపీ ఈ రిజర్వుడ్ సీట్లలో దారుణంగా దెబ్బతింది. 2019 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ అయిన 29 సీట్లలో టీడీపీ ఒకే ఒక్క చోట అది కూడా ప్రకాశం జిల్లాలోని కొండెపి నుంచి గెలిచింది. ఒక స్థానంలో జనసేన పార్టీ గెలుపొందింది. మిగిలిన 27 ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీనే విజయం సాధించింది. ఇక ఎస్టీ నియోజకవర్గాలు ఏడింటిలో టీడీపీ గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు.2014 ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాలు ఏడింటిలో పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నుంచి మాత్రమే టీడీపీ గెలుపొందింది. ఇక ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రం మొత్తం 29లో 15 చోట్ల గెలిచింది.
అలాగే గ్రేటర్ రాయలసీమ.. చిత్తూరు కడప కర్నూలు అనంతపురం నెల్లూరు జిల్లాల్లో 62 సీట్లున్నాయి. వీటిలో 2014 ఎన్నికల్లో టీడీపీ 27 సీట్లలో మాత్రమే గెలిచింది. 35 సీట్లలో ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గ్రేటర్ రాయలసీమను ఊడ్చిపెట్టేసింది. మొత్తం 62 సీట్లలో 59 సీట్లను గెలుచుకుంది. టీడీపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది. 2014లో గెలిచిన 27 సీట్లలో టీడీపీ 2019కి వచ్చే సరికి 24 సీట్లను పోగొట్టుకుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి రావాలంటే ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ సీట్లతోపాటు గత రెండు పర్యాయాలు తాము ఓడిపోయిన సీట్లపైన గట్టి దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమలో ఉన్న 62 సీట్ల పైన గట్టిగా దృష్టిపెట్టకపోతే టీడీపీకి మరోసారి ఆశాభంగం కాకతప్పదని అంటున్నారు. అలాగే కొన్ని సీట్లలో టీడీపీ 2009 నుంచి ఓడిపోతూనే ఉందని చెబుతున్నారు. గత మూడు పర్యాయాలుగా టీడీపీ ఓడిపోతున్న సీట్లు మొత్తం సీట్లు 175లో 50 ఉన్నాయని సమాచారం. ఈ మొత్తం 50 సీట్లపైనే దృష్టి పెడితానే టీడీపీ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు.