సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో కవితకు ఈడీ నోటీసులు, దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను ఎలా విస్తరించాలనే విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీటి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ కీలక సమావేశం గురువారం జరగనుంది. ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ, శాసనసభపక్షం.. రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల సంవత్సరంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కవితకు ఈడీ నోటీసులు, ఇవాళ మంత్రిమండలి సమావేశం నేపథ్యంలో రేపు జరిగే బీఆర్ఎస్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
తెలంగాణ తరహా పాలనను దేశవ్యాప్తంగా విస్తరించే లక్ష్యంతో.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన కేసీఆర్ ఆ దిశగా చర్యల్ని వేగవంతం చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించగా.. మరికొన్ని రాష్ట్రాలకు చెందిన నేతలు పార్టీలో చేరారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలపేతం చేసే అంశంపై కేసీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశం కానుంది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఆ భేటికి.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులతోపాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లు హాజరుకావాలని సమాచారం పంపించారు. ఎన్నికల ఏడాది అయినందున పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఎలా ఉంది, వాటిని ప్రజల్లో విస్తృతంగా ఎలా తీసుకెళ్లాలి.. రానున్న రోజల్లో పార్టీపరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని ఖండించే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల తీరు. జాతీయస్థాయిలో పార్టీ విస్తరణ వంటి కీలకాంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.