ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ వేగంగా విస్తరిస్తోంది. అయితే అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వ్యాపారం కుమార్తె ఇషా అంబానీ చేతికి వెళ్లిన తర్వాత గతంలో ఎన్నడూ చూడని వేగంతో దూసుకుపోతోంది.
బ్యూటీ వ్యాపారంలో..
తాజాగా రిలయన్స్ రిటైల్ తన ఈ-కామర్స్ బ్యూటీ ప్లాట్‌ఫారమ్ Tiraను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనికి తోడు త్వరలో తన ఆఫ్‌లైన్ స్టోర్లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మెుదటి స్టోర్ ను ముంబై నగరంలో ఏప్రిల్‌లో ఓపెన్ చేస్తోంది. రానున్న కాలంలో స్టోర్లను దేశంలోని ఇతర నగరాలకూ విస్తరించేందుకు రిలయన్స్ గ్రూప్ సిద్ధంగా ఉంది. వీటిని ‘షాప్-ఇన్-షాప్’, స్వతంత్ర ఫార్మాట్లలో ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.
ఉత్పత్తుల వివరాలు..
కంపెనీ తన Tira స్టోర్స్ ద్వారా మేకప్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాతింగ్, సువాసనలు, మెన్స్ బ్యూటీ, లగ్జరీ ఉత్పత్తులను అందించనుంది. ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ రిలయన్స్ ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంది. అయితే త్వరలో సాధారణ ప్రజల కోసం తెరవబడుతుందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ సుబ్రమణ్యం ఇండస్ట్రీ ఛాంబర్ FICCI నిర్వహించిన ఈవెంట్లో వెల్లడించారు.
ఆధునిక సాంకేతికత..
తీరా స్టోర్లు వర్చువల్ ట్రై-ఆన్స్, కస్టమైజ్డ్ సిఫార్సుల వంటి అనేక సాంకేతిక సౌకర్యాలను కలిగి ఉంది. లగ్జరీ ఉత్పత్తులు తీరా రెడ్ అనే ప్రత్యేక వర్గం క్రింద రిటైల్ చేయబడతాయి. గత సంవత్సరం రిలయన్స్ రిటైల్ మేకప్ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ ఇన్సైట్ కాస్మటిక్స్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.