NRI-NRT

అమెరికా వీసా…చాలా ఈజీ…

అమెరికా వీసా…చాలా ఈజీ…

అమెరికా వీసా ఇక ఈజీ కానుంది. రోజులు, నెలలకొద్దీ వేచి చూసే సమస్య తీరనుంది. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణం పూర్తవడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించింది.

హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌ ఆఫీస్‌ రెడీ

రూ.2,788 కోట్లతో భవన నిర్మాణం

ఒకేసారి 54 కౌంటర్లలో వీసాల జారీ

ఈ నెల 20న కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అమెరికా వీసా ఇక ఈజీ కానుంది. రోజులు, నెలలకొద్దీ వేచి చూసే సమస్య తీరనుంది. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణం పూర్తవడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించింది. ఒకేసారి 54 కౌంటర్లలో వీసాలు జారీ చేసేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సర్వాంగసుందరంగా కార్యాలయ నిర్మాణం పూర్తయింది.

సుమారు 340 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2788 కోట్లు)తో ఐటీ కారిడార్‌ ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ పరిధి నానక్‌రామ్‌గూడలో నిర్మించిన ఈ కార్యాలయం హైదరాబాద్‌కే తలమానికం కానున్నది. సుమారు 12.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఈ భవనం మరో ఐకానిక్‌ బిల్డింగ్‌గా మారనుంది. భారత్‌ -అమెరికా దేశాల నడుమ దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించే ఈ నూతన కార్యాలయం మార్చి 20న ప్రారంభం కానున్నది.

అత్యంత విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ కార్యాలయం ఆగ్నేసియాలోనే అతి పెద్దదిగా పేర్కొంటున్నారు. దరఖాస్తుల పరిశీలనలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కేంద్రంగానూ ఇది రూపుదిద్దుకోనున్నది. ఈ కార్యాలయంలో వీసా అపాయింట్‌మెంట్స్‌ సంఖ్య, ఇంటర్వ్యూ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. దీంతో వీసా ఆమోదం, పాస్‌పోర్టు పొందే గడువు తగ్గుతుంది. హైదరాబాద్‌ బేగంపేటలో పైగా ప్యాలెస్‌లో 2008 నుంచి యూఎస్‌ కాన్సులేట్‌ కార్యకలాపాలు కొనసాగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన సంఖ్యకు అనుగుణంగా ఈ నూతన కార్యాలయాన్ని నిర్మించారు.

అత్యాధునిక నిర్మాణ శైలి
నానక్‌రామ్‌గూడలో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయ నూతన భవనం అమెరికా నిర్మాణరంగ ప్రమాణాల మేరకు నిర్మించారు. సాధారణ భవనం కన్నా 50 శాతం విద్యుత్‌ వినియోగం తగ్గేందుకు వీలుగా మెకానికల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని వినియోగించుకునే జల సంరక్షణ వ్యవస్థతో 81.72 శాతం మేరకు నీటి వినియోగం తగ్గుతుంది. ఈ కార్యాలయాన్ని యునైటెడ్‌ స్టేట్స్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (యూఎస్‌జీబీసీ) గోల్డ్‌ క్యాటగిరీ కింద గుర్తించింది.

శాశ్వత చిరునామా
అమెరికా కాన్సులేట్‌ కార్యాలయ శాశ్వత చిరునామాగా ‘సర్వే నం. 115/1, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్‌, తెలంగాణ, 500032’ ఉంటుందని యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులు తెలిపారు.

23 నుంచి ఇంటర్వ్యూలు
ఈ నెల 15 వరకు బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో ఉన్న కాన్సులేట్‌ కార్యాలయంలోనే సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత నుంచి వారంపాటు కార్యాలయం మార్పిడి ప్రక్రియ చేపట్టి, ఇదేనెల 23 నుంచి వీసా దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలను నానక్‌రామ్‌గూడలోని నూతన కార్యాలయంలో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం +91 040-4033 8300, అత్యవసర సేవలను కోరుతున్న అమెరికా పౌరులు ఈ నంబర్‌ +91 040 6932 8000పై సంప్రదించాలని, అదేవిధంగా HydACS@state.gov కి ఈ-మెయిల్‌ చేయాలని సూచించారు.