ఉద్ధం సింగ్ డయ్యరును
అతడు మరణానికి భయపడలేదు..
గుండు దెబ్బకు వెరవలేదు..
చేసిన పనికి
పరితాపం చెందలేదు..
ఏం చేసినా నా దేశం కోసం..
నా దేశప్రజల గౌరవం కోసమేనని నమ్మి
స్వేచ్చ..ఆపై ప్రతీకారేచ్చ
నిండిన మనసుతో..
ఒకే ఒక్క గుండు దెబ్బ..
నా దేశం
ఎవడబ్బ సొమ్మురా
అని ప్రశ్నిస్తూ..
తెల్లవాడి పెత్తనాన్ని నిరసిస్తూ..
ఇంత ప్రాణభయం ఉన్నోడివి
జలియన్వాలాబాగులో
అంతమందిని ఎలా చంపావురా అన్న పొలికేకతో
ఒకే వేటు..
నేలకొరిగిన
నరరూప రాక్షసుడు డయ్యరు..
పొంగి పులకించింది
భరతజాతి మరొక్కమారు!
ఉద్దం సింగ్..
ఉరఫ్..
రామ్ మొహమ్మద్ సింగ్ అజాద్..
పేరులోనే భిన్నత్వంతో
కూడిన ఏకత్వం..
మూర్తీభవించిన
భారతీయ తత్వం..
ఘనీభవించిన
సర్వమత సమానత్వం..
ఒక తెల్లోడు..
కంటి సైగతో..
మారణకాండ సృష్టిస్తే
రక్తం మరిగి..
పగ పెరిగి..
దొరల సామ్రాజ్యం
దాకా సాగి..
ఇంగ్లాండ్ గడ్డపైనే
డయ్యరుకు మరణశిక్ష..
తీరిన భరతజాతి
ప్రతీకారకాంక్ష..!
అలా దేశం గౌరవం నిలిపి
తానయ్యాడు
షహీద్ ఎ అజం..
వీరులలో అగ్రగణ్యుడన్నది
నిజం..
నాటి మహావీరుల్లో
భగత్ సింగ్..రాజగురు..
సుఖదేవ్ సరసన స్థానం..
ఆ పేరు చెబితేనే
బెంబేలెత్తిపోయిన
బ్రిటిష్ సంస్థానం..!
ఇలాంటి వీరుల త్యాగాఫలం
ఒకనాటికి స్వరాజ్యమై…
ఈనాటికి స్వార్థపరుల
ఇష్టారాజ్యమై..
దుర్మార్గులకు రాజయోగం
విఫలమై మహనీయుల త్యాగం..!