రోజూ డ్యూటీ చేసే బస్సులోనే ఓ ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషాదకరం ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోలో చోటుచేసుకుంది. అయితే.. డ్యూటీకి వచ్చిన కండక్టర్.. రిజిస్టర్‌లో సంతకం చేసి డిపోలోకి వెళ్లి మళ్లీ తిరిగి బయటకు రాలేదు. బస్సులోనే ఉరేసుకుని ప్రాణత్యాగానికి పాల్పడ్డాడు. కాగా.. ఆ కండక్టర్ ఆత్మహత్యకు గల కారణాలేంటన్నది మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధానాంశాలు:
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డిపోలో విషాదం
బస్సులోనే ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కండక్టర్
కండక్టర్ ఆత్మహత్యపై వెల్లువెత్తున్న అనుమానాలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదకర ఘటన జరిగింది. ఓ ఆర్టీసీ కండక్టర్ తాను డ్యూటీ చేసే బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మండలం కంఠాయపాలెంకు చెందిన మహేందర్ రెడ్డి అనే ఆర్టీసీ కండక్టర్.. తొర్రూరు డిపోలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూలాగే ఆదివారం రోజున విధులకు హాజరయ్యాడు. అయితే.. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో.. డ్యూటీ రిజిస్టర్‌లో సంతకం పెట్టిన మహేందర్ రెడ్డి.. డిపోలోకి వెళ్లారు. కానీ.. మళ్లీ తిరిగి రాలేదు. ఎంతసేపటికీ మహేందర్ రెడ్డి బయటకు రాకపోవటంతో.. సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఏం జరిగి ఉంటుందా అని డిపో మొత్తం చూశారు. ఎక్కడా కనబడకపోయేసరికి.. అతను డ్యూటీ చేసే బస్సులో చూసేసరికి.. మహేందర్ రెడ్డి తువ్వాలతో ఉరేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు.
సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని డిపో అధికారులకు అందించారు. వాళ్లు మహేందర్ ఆత్మహత్య విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే డిపోకు చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మహేందర్రెడ్డి సూసైడ్ ఎందకు చేసుకున్నాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే.. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా.. ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే.. అతను రోజూ డ్యూటీ చేసే బస్సులోనే ప్రాణత్యాగం చేసుకోవటమనేది అందరినీ కలచివేస్తుంది. కాగా.. ఆయన ఆత్మహత్యకు దారి తీసిన కారణాలేంటీ అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ.. మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల ఒత్తిడి వల్లే సూసైడ్ చేసుకున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరి అది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.