లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐపీఎస్ అధికారిపై గంటల వ్యవధిలోనే విచారణకు ఆదేశించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అనిరుధ్ సింగ్ అనే ఐపీఎస్ అధికారి 20 లక్షలు లంచం తీసుకుంటుండగా వీడియో తీశారు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అనిరుధ్ మీద విచారణ జరపాలని వారణాసి పోలీస్ కమిషనర్‌ను ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆదేశించారు. ఇక ఇదే కాకుండా వారణాసిలో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్న అనిరుధ్ సింగ్ భార్య ఆర్తి సింగ్ ఇంటి అద్దె చెల్లించలేదనే ఆరోపణలపై కూడా విచారణకు ఆదేశించారు.అయితే తాను నిజంగా లంచం తీసుకోలేదని దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక అత్యాచార నిందితుడిని ట్రాప్ చేయడానికి తాను ప్రయత్నిస్తున్న వీడియో అని, అది చాలా పాతదని అనిరుధ్ అంటున్నారు. బీహార్‌కు చెందిన అనిరుధ్, 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో ఫతేపూర్ జిల్లా నుంచి మీరట్‌కు బదిలీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనిరుధ్ సింగ్‌ను వారణాసిలో పోస్ట్ చేసిన సంఘటనతో వైరల్ వీడియో లింక్ చేయబడిందని కూడా వారు చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో అనిరుధ్ సింగ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఈ వీడియో వైరల్ కావడంతో, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “యూపీలో ఐపీఎస్ అధికారి డబ్బు డిమాండ్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. మరి ఆ అవినీతి అధికారి ఇంటి మీదకు బుల్డోజర్ వెళ్తుందా?లేదంటే పరారీలో ఉన్న ఐపీఎస్ అధికారుల జాబితాలో మరొకరి పేరు చేరుతుందా? బీజేపీ కూడా ఈ విషయం నుంచి బయటపడుతుందా? నేరాల పట్ల భాజపా ఏమాత్రం సహనం చూపడం లేదు అనే వాస్తవాన్ని యూపీ ప్రజలు చూస్తున్నారు” అని అఖిలేష్ హిందీలో ట్వీట్ చేసి వైరల్ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు.