Food

జొన్న రొట్టెలను ఎంతో వేగంగా.. మెత్తగా.. ఇలా చేయవచ్చు..!

జొన్న రొట్టెలను ఎంతో వేగంగా.. మెత్తగా.. ఇలా చేయవచ్చు..!

మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. చాలా మంది వీటితో రొట్టెల‌ను, జావ, గ‌ట‌క వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి త‌గినంత శ‌క్తి ల‌భిస్తుంది. జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో ర‌క్త‌ప్రస‌ర‌ణ వ్య‌వ‌స్థను మెరుగుప‌ర‌చ‌డంలో కూడా జొన్న‌లు మ‌న‌కు ఉప‌యోప‌డ‌తాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

అలాగే జొన్న‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ విధంగా జొన్న‌లు మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. జొన్న‌ల‌తో ఎక్కువ‌గా రొట్టెల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. జొన్న రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. ఉద‌యం అల్పాహారంగా, మ‌ధ్యాహ్నం భోజ‌నంలో తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. జొన్న రొట్టెల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. జొన్న రొట్టెలు త‌యారు చేయ‌డం రాని వారు కూడా సుల‌భంగా త‌యారు చేసుకునేలా రుచిగా వీటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులో ఉప్పు వేసి నీటిని మ‌రిగించాలి. నీరు మ‌రిగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి జొన్న పిండి వేసి గంటెతో క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి.

త‌రువాత ఈ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకుని త‌గిన‌న్ని గోరు వెచ్చ‌ని నీళ్లు చ‌ల్లుకుంటూ పిండి మెత్త‌గా ఎక్కువ సేపు క‌ల‌పాలి. త‌రువాత పిండిని ఉండ‌లుగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ చ‌పాతీ పీట మీద లేదా ప్లేట్ మీద పొడి చ‌ల్లుకుంటూ చ‌పాతీ కర్ర‌తో ఎక్కువ బ‌లంఉప‌యోగించ‌కుండా చాలా నెమ్మ‌దిగా వ‌త్తుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక రొట్టెను పెనం మీద వేసుకోవాలి. త‌రువాత కాట‌న్ వ‌స్త్రాన్ని నీటిలో ముంచి రొట్టె మీద రుద్దుకోవాలి. ఈ జొన్న రొట్టెను రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని గాలి త‌గ‌ల‌కుండా హాట్ బాక్స్ లో లేదా వాటిపై మూత పెట్టి ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న రొట్టెలు త‌యార‌వుతాయి. వీటిని ఏ కూర‌ల‌తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా జొన్న రొట్టెల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.