Movies

మనోహర దృశ్య కావ్యం పాతాళభైరవి. విడుదలై నేటికీ 72 ఏళ్లు.. ప్రత్యేక కథనం

మనోహర దృశ్య కావ్యం పాతాళభైరవి. విడుదలై నేటికీ 72 ఏళ్లు.. ప్రత్యేక కథనం

1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రమూ పాతాళ భైరవే.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది.

డెబ్బై రెండు వసంతాలు
పూర్తయిన సందర్భంగా
ఆ మనోహర దృశ్యకావ్యంపై
ఓ అవలోకనం..
————————————
జై పాతాళభైరవి..!
————————————
సాహసం సేయరా ఢింబకా..
ఓ తోటరాముడు ..
నేపాలీ మాంత్రికుడు..
వరాలిచ్చే బుల్లి బొమ్మ ..
కె వి రెడ్డి జాలం..
తిరుగులేని విజయం..
పాతాళభైరవి..
ఇరవై మూడు రీళ్లు..
విడుదలై నేటికి డెబ్బైరెండేళ్లు..!

చూస్తున్నది సినిమానా..
మన ఎదురుగా జరుగుతున్న జానపద ఇతివృత్తమా..
అన్నంత సహజంగా కళ్ళకు కట్టిన దృశ్యకావ్యం..
తోటరాముడి అమాయకత్వం..
దానిని తన స్వార్థం కోసం వాడుకునేందుకు
మాంత్రికుడి యత్నం..
ఈ ప్లాట్ చుట్టూ
మూడు గంటలకు
పైగా సాగిన కథ..
ఓ చరిత్ర..
ఎన్టీఆర్ కు స్టార్ డం..
ఎస్వీఆర్ కు
మహానటుడి స్థాయి..
పద్మనాభం,గిరిజ,సిఎస్సార్
ఇలా ఎందరో నటులకు మహర్దశ..
బాలకృష్ణకి అంజి అనే
పెర్మనెంట్ పేరు..
సావిత్రికి అరంగేట్రం..
విజయా సంస్థకు
ఒక బ్రాండ్ హోదా..
ఇంకా ఎన్ని విశేషాలు..
ఎంత చెప్పుకున్నా సశేషాలు..
నాగిరెడ్డి,చక్రపాణి…
ఈ హిస్టరీ వెనక ఉన్న
తిరుగులేని బాదుషాలు!

నిజానికి అల్లాఉద్దీన్ కథ
దానికి తెలుగుదనం అద్ది..
తోటరాముడిని తీర్చిదిద్ది..
యశస్వి రంగారావును
భయం గొలిపే
మాంత్రికుడిగా అచ్చుగుద్ది..
సదాజపా అన్న పిలుపు..
సంజీవినిని సిద్ధం సాయరా..
అనే హుకుం..
గెడ్డమేలనే అడ్డం..
ఇలాంటి మురిపింపు..
ఎంత ఘాటు ప్రేమయో
అంటూ ప్రేమ పులకింపు..
ప్రతి ఉదంతం కనులకింపు..!

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు..
అయ్యో పాపం పసివాడు..
ఇలా మాయావిని నమ్ముకుని..
తోటరాముడి సాహసయాత్ర..
మొసలితో యుద్ధం..
సాష్టాంగం రాదనే
ఎన్టీవోడి యుక్తి…
బోర్లా పడిన
రంగారావు తలను
జై పాతాళభైరవీ అంటూ
ఒక్క వేటున నరికిన వైనం..
అటు పిమ్మట బీభత్సం
నరుడా ఏమి నీ కోరిక..
దేవత ప్రత్యక్షమై వరాలివ్వడం
ప్రతి దృశ్యం..
ఇప్పటికీ సజీవంగా..
విజయావారి దృశ్యకావ్యం..
రాకపోయినా ఆస్కార్..
చెక్కుచెదరని ప్రేక్షకాదరణే
తిరుగులేని పురస్కార్..!

నరుడా ఏమి నీ కోరిక..

మళ్లీ ఎన్టీఆర్ తిరిగొచ్చి
తోటరాముడిగా
కనిపిస్తే చూడాలని..
సాహసం
సేయరా ఢింబకా..ఎస్వీఆర్
అంటూ ఉంటే వినాలని..
గాలిలో ఎగురుతున్న భవనంపై
ఆ ఇద్దరి యుద్ధం కాంచాలని..
అలా పాతాళభైరవి
బయోస్కోప్ పదేపదే
తిలకించాలని..
తిలకించి పులకించాలని..!
✍️✍️✍️✍️✍️✍️✍️