ఉత్తర ప్రదేశ్‌లోని ఔరేయా జిల్లాలో ఘటన
చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుడిపై భక్తిభావం పెంచుకున్న యువతి
శ్రీృకృష్ణుడితో పెళ్లికి అంగీకరించిన తల్లిదండ్రులు
అంగరంగ వైభవంగా వివాహం
ఆపై అప్పగింతల కార్యక్రమం
ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి శ్రీకృష్ణుడిని పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహాన్ని చూసేందుకు జనం పోటెత్తారు. ఔరేయా జిల్లాలోని బిధువా పట్టణంలో జరిగిందీ ఘటన.
రిటైర్డ్ టీచర్ రంజిత్ సింగ్ సోలంకి కుమార్తె రక్షా సోలంకి(30) పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం ఎల్ఎల్‌బీ చదువుతోంది. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిపై భక్తిభావం, ప్రేమను పెంచుకున్న సోలంకి ఆయననే పెళ్లాడాలని నిర్ణయించుకుంది. విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తొలుత ఆశ్చర్యపోయినా ఆ తర్వాత కుమార్తె ఇష్ట ప్రకారం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడేందుకు వారు అంగీకరించారు.
పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ముహూర్త సమయానికి వధువు శ్రీకృష్ణుడి విగ్రహంతో మండపంలో అడుగుపెట్టింది. బరాత్ డ్యాన్స్‌లు, డీజే మ్యూజిక్ సర్వసాధారణమయ్యాయి. పెళ్లికొచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించారు. వారికి ఆహార, పానీయాలు అందించారు.
ముహూర్త సమయంలో వధువు సోలంకి శ్రీకృష్ణుడి విగ్రహం మెడలో తాళి కట్టింది. రాత్రంతా జరిగిన ఈ వివాహ వేడుక తర్వాత అప్పగింతల కార్యక్రమం కూడా జరిగింది. అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహంతో వధువు సుక్‌చైన్‌పూర్ గ్రామంలో తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత తిరిగి తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది.