హైదరాబాద్ లోని చారిత్రాత్మక పాగ్ ప్యాలెస్ నుంచి 14 ఏళ్లుగా సేవలు అందించిన అమెరికన్ కాన్సులేట్ బుధవారం నాడు ఖాళీ చేయనుంది.
హైదరాబాద్లోని చారిత్రక పైగా ప్యాలెస్ నుంచి 14 ఏళ్లుగా సేవలు అందించిన అమెరికా కాన్సులేట్.. బుధవారం ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేస్తోంది. నానక్రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మించిన సొంత భవనానికి మారుతోంది. నేటితో బేగంపేట కార్యాలయం సేవలు ఆగనున్నాయి. నానక్ రాంగూడలో ఈ నెల 23 నుంచి వీసా సేవలను ప్రారంభించనున్నట్లు కాన్సులేట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా ప్రజలకు వీసా సేవలతోపాటు ఆయా ప్రాంతాల్లోని అమెరికా సంస్థలకు ఈ కార్యాలయం నుంచే సేవలు అందించనుంది.
2006 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. నగరంలో అమెరికా కాన్సులేట్ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆ మేరకు 2007 జులైలో కాన్సులేట్ ఏర్పాటుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అమెరికా ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. కాన్సులేట్ ఏర్పాటు కోసం నగరంలో పలు భవనాలను పరిశీలించిన అమెరికా అధికారులు.. పైగా ప్యాలెస్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అద్దె ప్రాతిపదికన కేటాయించడంతో 2008 అక్టోబరులో కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
యూరోపియన్ శైలిలో ప్యాలెస్ నిర్మాణం
హైదరాబాద్ సంస్థానంలోని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ వద్ద ప్రధానమంత్రిగా పని చేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా.. బేగంపేటలోని రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో యూరోపియన్ శైలిలో ఈ ప్యాలెస్ ను నిర్మించి నిజాంకు బహుమతిగా ఇచ్చారు. కాలక్రమంలో ఆ భవనం రాష్ట్ర ప్రభుత్వ వారసత్వ సంపదగా మారింది. కాన్సులేట్ ఏర్పాటు వరకూ.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కార్యాలయం ఈ ప్యాలెస్లోనే ఉండేది.
రాష్ట్ర ప్రభుత్వం కాన్సులేట్కు నానక్ రాంగూడలో 12.3 ఎకరాలు కేటాయించడంతో నూతన ప్రాంగణ నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేశారు. 340 మిలియన్ డాలర్ల వ్యయంతో ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మించారు.
రోజుకు 2,500 ఇంటర్వ్యూలు
నూతన ప్రాంగణంలో ఈ నెల 23 నుంచి వీసా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. బేగంపేటలోని కాన్సులేట్ కార్యాలయంలో 18 వీసా ఇంటర్వ్యూ కేంద్రాలు (విండోస్) ఉండగా.. నూతన ప్రాంగణంలో 54 ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ రోజుకు సుమారు 2,500 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సౌకర్యాలు ఉన్నాయి.