ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలే. ఆనం అయితే నిన్న అంటే అసెంబ్లీ ప్రారంభం రోజున ఏకంగా టీడీపీ వాళ్లతో పాటు కూర్చుండిపోయారు. అయితే ఇవాళ సడెన్‌గా అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు ఆనం రాం నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఎదురు పడ్డారు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీల్లో కలుసుకున్న వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రస్తావన వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని ఆనంకు చెప్పానని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో అదే ఆచరిస్తారా? అని ప్రశ్నించారట. దీనికి తాను ఎప్పుడూ ఆత్మ ప్రబోధానుసారమే ఓటేస్తానంటూ ఆనం వ్యాఖ్యానించారు.