ముప్పై ఏండ్ల క్రితం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఓ వ్యాపారి.. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సిరిమంతుడిగా కొనసాగారు. అతనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. 2001 వరకూ ఆయన ఓ మోస్తరు పారిశ్రామికవేత్తగానే అందరికీ తెలుసు
ఇద్దరు మిత్రుల కథ ఇది. సొంతూరుకే చెందిన స్నేహితుడంటే మరో నేస్తానికి చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎంతలా పెరిగిపోయిందంటే.. తనను నమ్మి రాజ్యాధికారాన్ని అప్పగించిన ప్రజల సంక్షేమాన్ని కూడా గాలికొదిలేశాడు. అంతేకాకుండా, తన నేస్తం కోసం జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టేశాడు. అలా అక్రమ సంపదను నింపుకొన్న ఆ భారీ షిప్ ఇప్పుడు మునిగిపోతున్నది. అయినప్పటికీ, తన మిత్రుడిని కాపాడటానికి ఆ స్నేహితుడు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ ఇద్దరు మిత్రులెవరో 140 కోట్ల భారతావనికి తెలుసు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ముప్పై ఏండ్ల క్రితం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఓ వ్యాపారి.. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సిరిమంతుడిగా కొనసాగారు. అతనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. 2001 వరకూ ఆయన ఓ మోస్తరు పారిశ్రామికవేత్తగానే అందరికీ తెలుసు. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారో.. అప్పట్నుంచి అదానీకి ఆమ్దానీ మొదలైందని చెప్పొచ్చు. అత్యంత కారుచౌకగా మోదీ ధారాదత్తం చేసిన వేల ఎకరాల భూముల పునాదులపైనే నేడు అదానీ గ్రూప్ దేశంలోని దాదాపు అన్ని రంగాలపై గుత్తాధిపత్యం వహిస్తున్నదన్న ఆరోపణలున్నాయి.
కారు చౌకగా కట్టబెట్టారు
గుజరాత్ పశ్చిమ తీరంలోని కచ్ ప్రాంతంలో బంజరు భూములు, చిత్తడి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పంటలు అంతగా పండవు. దీంతో ఆ భూములను అభివృద్ధి చేస్తున్నామన్న నెపంతో అప్పుడు సీఎంగా ఉన్న మోదీ.. అదానీ కంపెనీకి 15,946.32 ఎకరాల (6,45,31,173 చదరపు మీటర్లు)ను 30 ఏండ్లపాటు లీజుకు ఇచ్చేశారు. 2006-08 మధ్య ఇది జరిగింది. అప్పుడు అక్కడ ఒక్కో చదరపు మీటరు భూమి ఖరీదు రూ.650 వరకు ఉన్నది. ఈ లెక్కన రూ.4,194 కోట్లు వసూలు చేయాలి. అయితే, ప్రభుత్వం మాత్రం వసూలు చేసింది రూ.3 కోట్ల నుంచి రూ.15 కోట్లు మాత్రమే. కారణం.. చదరపు మీటర్ భూమిని అదానీ కంపెనీకి 60 పైసల నుంచి రూ.2.5కు కట్టబెట్టడమే. ఇదే సమయంలో ఇండియన్ ఆయిల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థకు నిబంధనల పేరిట చదరపు మీటర్‌కు రూ.650 వసూలు చేయడం గమనార్హం. కచ్ ప్రాంతంలో ఈ స్థాయిలో మరే ఇతర ప్రైవేట్ కంపెనీకి ఇంత చౌకగా, ఇంత భారీగా భూములు అప్పజెప్పలేదు. అదానీ గ్రూప్‌నకు ప్రభుత్వం కేటాయించిన ఈ భూముల్లోనే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) ఏర్పాటు చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల్లో ప్రధానమైన ముంద్రా పోర్ట్, థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఈ భూముల్లోనే ఏర్పాటు చేశారు.
ప్రభుత్వానికి మాత్రం నిబంధనలు
అదానీ గ్రూప్‌నకు ముంద్రా పోర్టును కట్టబెట్టడానికి, సెజ్ ఏర్పాటుకు గుజరాత్ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు పెట్టలేదు. అయితే, ముంద్రా పోర్టుకు కేవలం 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాండ్లా పోర్టుకు మాత్రం సవాలక్ష నిబంధనలను ఎత్తిచూపింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్, పర్యావరణ అనుమతుల పేరిట సెజ్ ఏర్పాటుకు ఎన్నో అడ్డంకులను సృష్టించింది. ఇలా మొదలైన అదానీ గ్రూప్ విస్తరణ బీజేపీపాలిత రాష్ర్టాలకు క్రమంగా విస్తరించింది. బొగ్గు గనులు, విద్యుత్తు ప్లాంట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, మీడియా ఇలా పలు రంగాల్లో అదానీ గ్రూప్ పాతుకుపోయింది. ఇండోనేషియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తదితర దేశాల్లోనూ అదానీ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. వీటి కోసం ప్రధాని మోదీ స్వయంగా దౌత్యం వహించినట్టు ఆరోపణలున్నాయి.
రెండు నెలల్లో 126 కాంట్రాక్టులు
2014-17 మధ్య కాలంలో లాంకో-ఉడిపి థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఎల్‌అండ్‌టీ, ఒడిశాలోని టాటా ధమ్రా పోర్ట్‌లను అదానీ గ్రూప్ చేజిక్కించుకొన్నది. ఇదే సమయంలో విండ్ ఎనర్జీ, సోలార్ పవర్, పవర్ డిస్ట్రిబ్యూషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలకు విస్తరించింది. ముంబై నగరానికి విద్యుత్తు సరఫరా కోసం రిలయన్స్ పవర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ బిజినెస్‌ను రూ.12,300 కోట్లతో 2018లో చేజిక్కించుకొన్నది. ఛత్తీస్‌గఢ్‌లోని జీఎమ్మార్ థర్మల్ పవర్ ప్రాజెక్టును రూ.5,200 కోట్లకు, చెన్నై సమీపంలోని లార్సెన్ అండ్ టూబ్రో పోర్టును రూ.1,950 కోట్లకు, రూ.228 కోట్లు చెల్లించి రాజస్థాన్‌లోని కేఈసీ ఇంటర్నేషనల్ పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్ ప్రాజెక్టును దక్కించుకొన్నది. సీవేజ్ ట్రీట్మెంట్, న్యాచురల్ గ్యాస్ నెట్‌వర్క్స్, పెట్రోల్ బంకుల పేరిట 2018 సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో మోదీ ప్రభుత్వం అదానీ గ్రూప్‌నకు ఏకంగా 126 కాంట్రాక్టులను కట్టబెట్టింది.
లాభదాయకమైన అక్రమాలు
2006-09 మధ్య అదానీ ఎనర్జీ కంపెనీకి గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ సహజ వాయువును సరఫరా చేసింది. బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు గ్యాస్‌ను కొని అదానీ కంపెనీకి అత్యంత చౌకగా పంపిణీ చేసేది. దీంతో అదానీ ఎనర్జీకి రూ.70.5 కోట్ల మేర లబ్ధి చేకూరినట్టు కాగ్ గుర్తించింది. ఇక, 2009-12 మధ్య విద్యుత్తు సరఫరా చేస్తానని గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ అనే కంపెనీతో అదానీ పవర్ ఒప్పందం కుదుర్చుకున్నది. కానీ దీన్ని మీరడంతో అదానీ కంపెనీపై రూ.79.8 కోట్ల పెనాల్టీ పడింది. అయితే ఒప్పందం విలువ రూ.240 కోట్లుగా ఉండటం గమనార్హం. ఈ విషయం కూడా కాగ్ నివేదికలోనే బయటపడింది. ఈ రెండు కేసులు ఏమయ్యాయో.. ఇప్పటికీ తెలియదు.
విచారణకు కమిటీ ఎందుకు వేయలేదు?
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించారా?
ప్రశ్నలన్నింటికీ ‘నో సార్’ అని నిర్లజ్జగా కేంద్రం సమాధానం
బీజేపీ పాలిత రాష్ర్టాలు మినహా ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో మాత్రమే అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్టు కేంద్రం, దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయి. దేశాన్ని ఒక్క కుదుపు కుదిపి, అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు తీసిన అదానీ ఉదంతంలో విచారణకు ఎలాంటి కమిటిని వేయలేదని కేంద్రం పార్లమెంట్‌సాక్షిగా నిర్లజ్జగా స్పష్టం చేసింది. తమిళనాడు తిర్పూర్‌కు చెందిన సిపిఐ ఎంపి కె సుబ్బరాయన్ రెండు రోజుల కిందట లోక్‌సభలో అదానీ సంస్థపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా కమిటీ వేసిందా? అని లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. అదానీ సంస్థపై హిండెన్ బర్గ్ వెల్లడించిన పరిశోధన నివేదికపై ఎలాంటి చర్య తీసుకున్నారు? తీసుకున్నట్టు అయితే ఆ వివరాలు ఏమిటి? దర్యాప్తునకు కమిటీ వేసినట్టు అయితే ఆ నివేదికను ఎప్పుడు సమర్పించబోతున్నారు? అని ప్రశ్నించారు.
ఈ మూడు ప్రశ్నలకు కలిపి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన సమాధానం ‘నో సార్’. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలో చీమ చిటుక్కుమన్నా, ఆకాశరామన్న లేఖ వచ్చినా, అనామకుడు ఎవరైనా ఫిర్యాదు చేసినా, చివరకు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సూమోటోగా విచారణకు దిగినట్టు ప్రకటించే ఈడీ, సిబిఐ, ఐటీ దర్యాప్తు సంస్థలకు మాత్రం పార్లమెంట్‌ను కుదిపేసినా కనిపించకపోవడం, వినిపించకపోవడంతో ఈ ఏజెన్సీల విశ్వసనీయతపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన అత్యున్నత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీలను ఏ విధంగా తమ స్వార్థ రాజకీయ ఎజెండా కోసం దుర్వినియోగం చేస్తున్నాయో.. లోక్‌సభలో ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం చెప్పకనే చెప్పినట్టు అయింది.