ఏపీ అసెంబ్లీ లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేస్తూనే వస్తున్నారు. శుక్రవారం కూడా టీడీపీ ఎమ్మెల్యేల ను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. బడ్జెట్‌పై మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈమేరకు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి ఆందోళన చేయడంతో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్కరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, గణబాబు, రామకృష్ణబాబు, రామరాజు, బాల వీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవానీ, చిన్నరాజప్పను సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులకు సభలో కుర్చునే ఓపిక లేదంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు రోజు గొడవ చేసి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారని ఆరోపించారు.