కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (Canadian Border Security Agency) ఏకంగా 700 మంది భారతీయ విద్యార్థులకు దేశ బహిష్కరణ నోటీసులు జారీ చేసింది.
ఎన్నారై డెస్క్: కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (Canadian Border Security Agency) ఏకంగా 700 మంది భారతీయ విద్యార్థులకు దేశ బహిష్కరణ నోటీసులు జారీ చేసింది. విద్యార్థులకు సంబంధించిన వీసా పత్రాలతో (Visa Documents) పాటు కాలేజీ అడ్మిషన్ ఆఫర్ లెటర్‌లు (Admission Offer Letters) నకిలీవని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ఈ విషయంపై టొరంటో నుంచి చమన్ సింగ్ భాత్ అనే భారతీయ విద్యార్థి మాట్లాడుతూ.. ప్లస్ టు పూర్తి చేసిన 700 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ మిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా యూకే స్టడీ వీసా (UK Study Visa) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఎడ్యుకేషన్ మిగ్రేషన్ సర్వీసెస్‌ను జలంధర్‌కు చెందిన బ్రిజేష్ మిశ్రా అనే వ్యక్తి నడిపిస్తున్నాడు. ఈ వీసా దరఖాస్తులన్నీ 2018 నుంచి 2022 మధ్య వచ్చాయి.
ఇక మిశ్రా విద్యార్థుల నుంచి రూ.16 నుంచి రూ.20లక్షల చొప్పున వసూలు చేశాడు. ఇందులో హంబర్ కాలేజీ (Humber College) అడ్మిషన్ ఫీజుతో కలిపి ఇతర అన్ని ఖర్చులు ఉన్నాయి. అయితే, విమాన టికెట్లు, సెక్యూరిటీ డిపాజిట్, మధ్యవర్తికి చెల్లించాల్సినవి అదనంగా తీసుకున్నాడు. ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత విద్యార్థులందరూ టొరంటో (Toronto) చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత హంబర్ కాలేజీ నుంచి వారికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అందులో అవతలి వ్యక్తి చెప్పింది విన్న తర్వాత వారికి గుండె ఆగినంత పనైంది. ఇప్పటికే కళాశాలలో సీట్లన్నీ భర్తీ అయిపోయాయని, వచ్చే విద్యా సంవత్సరం వరకు వేచి చూడాల్సిందేనని చెప్పడంతో దిమ్మతిరిగి మైండ్‌బ్లాక్ అయింది. అయితే, విద్యార్థులు కట్టిన అడ్మిషన్ ఫీజు మాత్రం రిటర్న్ చేశారు.
ఈ ఘటనతో విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ఈ క్రమంలో వారికి మిశ్రా మరో కాలేజీ నుంచి ఆఫర్ ఇప్పించాడు. దాంతో వారికి రెండేళ్ల డిప్లమా కోర్సులో చేరేందుకు అవకాశం దొరికింది. అంతేగాక కోర్సు పూర్తైన తర్వాత విద్యార్థులకు వర్క్ పర్మిట్స్ (Work Permits) కూడా దొరుకుతాయని నమ్మించాడు. దాంతో విద్యార్థులు కావాల్సిన ధృవపత్రాలను అక్కడి ఇమ్మిగ్రేషన్ విభాగానికి అందజేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైందని భాత్ చెప్పుకొచ్చాడు. సీబీఎస్ఏ (CBSA) విద్యార్థులు సమర్పించిన పత్రాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. వారికి ఇచ్చిన కాలేజీ అడ్మిషన్ లెటర్స్, వీసా పత్రాలు నకిలీవని తేలింది. దాంతో సీబీఎస్ఏ అధికారులు 700 మంది భారతీయ విద్యార్థులకు బహిష్కరణ నోటీసులు ఇవ్వడం జరిగింది. బ్రిజేష్ మిశ్రా వల్ల ఇప్పుడు 700 మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంగా మారింది.