Politics

స్వప్నలోక్ అగ్ని ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

స్వప్నలోక్ అగ్ని ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అన్నారు.

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌ అలీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సూచించారు.

ఏం జరిగిందంటే..

సికింద్రాబాద్‌లోని రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి వేళ 7, 8 అంతస్థుల్లో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత 5, 6 అంతస్థులకు మంటలు వ్యాపించాయి. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేసే పనిలోకి దిగారు. మంటలు అంటుకున్న ఫ్లోర్లలో ప్రైవేట్‌ కార్యాలయాలు, దుస్తుల గోదాములు ఉన్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది ఇండ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. కొందరు హాహాకారాలు చేస్తూ ప్రాణాలతో బయటపడగా, పలువురు మంటల్లో చిక్కుకున్నారు. మంటల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని భావించిన అధికారులు సమీప నివాసాల్లో ఉన్న వారిని సైతం ఖాళీ చేయించారు.

అగ్నిమాపక శాఖ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి భారీ క్రేన్ల సహాయంతో భవనంలో చిక్కుకున్న మొ త్తం 13 మందిని బయటకు తీసుకొచ్చారు. మంటల ధాటికి వచ్చిన పొగతో వీరిలో కొం దరు స్పృహ కోల్పోగా రెస్క్యూ సిబ్బంది సీపీఆర్‌ చేశారు. అనంతరం హుటాహుటిన గాంధీ దవాఖానకు ఐదుగురిని, అపోలో దవాఖానకు ఒకరిని తరలించారు. వీరు దవాఖానల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, వీరంతా ఊపిరి ఆడక చనిపోయినట్టు వైద్యులు పేర్కొన్నారు. నలుగురు యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతి చెందిన వారిలో శివ, ప్రశాంత్‌, ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి ఉన్నారు. వీరంతా 25 ఏండ్ల లోపు వారే.

13 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది..
ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో మొత్తం 13 మంది చిక్కుకోగా.. రాత్రి 11 గంటలకు వరకు శ్రమించిన రెస్క్యూ సిబ్బంది వారందరినీ బయటకు తీసుకువచ్చారు. ఇందులో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని గాంధీకి, మరో ఐదుగురిని రెండు ప్రైవేటు దవాఖానలకు తరలించారు. అయితే గాంధీకి తరలించిన ఐదుగురు, ప్రైవేటు దవాఖానలోని ఒకరు ఊపిరి ఆడక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

వర్షం కారణంగా తక్కువ రద్దీ..
సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్‌ కాంప్లెక్సు ఎప్పుడూ రద్దీతో ఉంటుంది. రకరకాల వ్యాపార సంస్థలు ఉండటంతో అక్కడికి చాలామంది వస్తుంటారు. గురువారం నగరంలో వర్షం కురవడంతో పాటు మేఘావృతమై ఉండటంతో షాపింగ్‌ కోసం ఆ కాంప్లెక్సుకు ఎక్కువ మంది రాలేదు. సాధారణ పరిస్థితులు ఉంటే అక్కడికి చాలా మంది వచ్చి ఉండే వారు.